Delimitation: కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర.. 56 పార్టీల కీలక భేటీ

by Prasad Jukanti |

డీలిమిటేషన్ పై సౌత్ స్టేట్స్ సమిష్టి కార్యాచరణ దిశగా కీలక అడుగులు ముందుకు పడుతున్నాయి.

Delimitation: కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర.. 56 పార్టీల కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సౌత్ స్టేట్స్ (South States) మధ్య మరోసారి రచ్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని సౌత్ స్టేట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే డీలిమిటేషన్ (Delimitation) వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని బీజేపీ వాదిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ తమిళనాడులో నిర్వహించిన ఆల్ పార్టీ మీంటింగ్ ఆసక్తిగా మారింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని అందువల్ల ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు సచివాలయంలో డీఎంకే (DMC) నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్ ప్రక్రియకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ దేశ సంక్షేమం కోసం గత 50 ఏళ్లలో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్షగా మారకూడదని స్టాలిన్ (MK Stalin) అన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని, అది రాబోయే 30 ఏళ్ల వరకు ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పంపుతామని అలాగే ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని స్టాలిన్ తెలిపారు.

64 పార్టీలకు ఆహ్వానం...

అధికార డీఎంకే నేతృత్వంలో జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్‌కు (All party meeting)

మొత్తం 64 పార్టీలకు ఆహ్వానం పంపించారు. అందులో 56 పార్టీలు (సంస్థలు సహా) పాల్గొన్నాయి. బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, పుధియ తమిళగం, పుధియ నీది కట్చి, నామ్ తమిళర్ కట్చి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనలేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే సెల్వపెరుంతగై, అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. జయకుమార్, ఎంఎన్ ఎం అధ్యక్షుడు కమల్ హాసన్, వీసీకే అధ్యక్షుడు తిరుమవల్వన్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇతర రాష్ట్రాల్లో సీఎం పర్యటించాలి..

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యక్తిగతంగా ఇతర రాష్ట్రాలను సందర్శించాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కోరారు. దక్షిణాది రాష్ట్రాలకు కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వీసీకే అధినేత తిరుమావళవన్ స్వాగతించారు. మనితానేయ మక్కల్‌ కట్చి చీఫ్‌ ఎంహెచ్‌ జవహిరుల్లా మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుంచి ఎంపీల సంఖ్య తగ్గడం లేదని కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య పెరిగితే ఇబ్బందిగా మారుతుందని అన్నారు.

సౌత్‌ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం : విజయ్

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని టీవీకే అధినేత విజయ్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయమని పేర్కొన్నారు. సౌత్ స్టేట్స్‌లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గినా, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో సంఖ్య పెరిగినా సహించేది లేదన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పోరాడతామన్నారు. ఈ మేరకు విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలోనూ వ్యతిరేకత..

డీలిమిటేషన్‌పై తెలంగాణలోనూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచే కుట్ర చేస్తోందని, దీంతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా ప్రయోజనం పొందనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలని బీజేపీ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది శిక్ష అని మండిపడ్డారు. ఈ అంశంపై ఇటీవల స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story