సోషల్ మీడియాలో రైల్వే‌పై ఫేక్ వీడియోలు.. అసత్య ప్రచారం చేస్తే అంతే! దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2025-10-18 15:37:02  IST  )

సోషల్ మీడియాలో రైల్వే ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది.

సోషల్ మీడియాలో రైల్వే‌పై ఫేక్ వీడియోలు.. అసత్య ప్రచారం చేస్తే అంతే! దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో జరిగిన పాత సంఘటనల వీడియోలు, అసత్య సమాచారాన్ని (Social media) సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని (South Central Railway) దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రయాణికుల్లో గందరగోళం, ఆందోళన ఏర్పడుతుందని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొదలైన సోషల్ మీడియా వేదికలపై ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన 20కి పైగా హ్యాండిళ్లను గుర్తించామని ఆయన తెలిపారు. వీరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైల్వే స్టేషన్లలో గుంపులు, అవాంఛనీయ సంఘటనలతో సంబంధం ఉన్న పాత వీడియోలను కనీసం నిజమో కాదో చెక్ చేయకుండా ఓ నిర్ణయానికి రావొద్దని ఆయన సూచించారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, నిర్ధారించని వార్తలను ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ 24×7 సోషల్ మీడియా మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తోందని, ఎవరైనా అసత్య సమాచారం ప్రచారం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన సమాచారాన్ని పొందేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌ @RailMinIndia ను వినియోగించాలని ప్రయాణికులను సీపీఆర్ఓ కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story