అమ్మిందే మళ్లీ అమ్మేసి..! రెండుసార్లు భూముల విక్రయాలు

by Kema Shiva Kumar |

భూముల రికార్డులను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది.

అమ్మిందే మళ్లీ అమ్మేసి..! రెండుసార్లు భూముల విక్రయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల రికార్డులను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. కానీ అధికారులేమో సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎక్కడి అప్లికేషన్లు అక్కడే ఉన్నాయి. సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నేటికీ గడప దాటలేదు. బీఆర్ఎస్ హయాం నుంచి పెండింగులో ఉన్న 9.40 లక్షల దరఖాస్తులను పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ఆఫీసర్లను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క శాతం సైతం పూర్తి కాలేదు. ఓ వైపు మార్గదర్శకాలు అవరోధంగా మారగా మరో వైపు చేతులు మారిన భూముల క్లాసిఫికేషన్‌తో పెద్ద చిక్కు ఏర్పడింది. ఈ అప్లికేషన్‌లలో అసైన్డ్, ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూములు సైతం ఉండటంతో ఏం చేయాలో తెలియడం లేదని తహశీల్దార్లు చెబుతున్నారు.

సర్వే నంబర్లతోనే ఈ క్లాసిఫికేషన్

క్షేత్ర స్థాయి పరిశీలనకు ముందే సర్వే నంబర్లతోనే ఈ క్లాసిఫికేషన్ అడ్డొస్తున్నది. లావునీ పట్టాదారులు ఎంతకో అంతకు అన్నట్లు అమ్మేసి తెల్లకాగితాలపై సంతకాలు పెట్టేశారు. ఇప్పుడేమో వాటిని క్రమబద్ధీకరించే అవకాశం లేదు. పీవోటీ చట్టం కింద చేతులు మారిన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత కొనుగోలుదారుడి గురించి ఆలోచించాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి సన్న, చిన్నకారు రైతుగా గుర్తిస్తే రీ అసైన్‌మెంట్‌కు అవకాశాలున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు.. అంటే సాదాబైనామాల ప్రక్రియతో పాటే పూర్తి చేయడం అసాధ్యమని చెబుతున్నారు. అయితే ఇప్పుడీ సాదాబైనామాల పరిశీలనలో అసైన్డ్ భూములు చేతులు మారినవి పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ, అటవీ, దేవాదాయ శాఖ భూములను సైతం కొనుగోలు చేసినట్లు కాగితాలు పెట్టారు. వాటిని తిరస్కరించడం మినహా మరో గత్యంతరం లేదంటున్నారు.

ఏకపక్షంగా తిరస్కరించడమే..

సాదాబైనామాల ద్వారా అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూములుంటే ఏకపక్షంగా తిరస్కరించడమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసైన్డ్ భూములకు మాత్రం పీవోటీ చట్టం ఆధారంగా స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత ఈ అప్లికేషన్‌ను అసైన్డ్ భూముల కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండే కమిటీ నిర్ణయం మేరకు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే అసైన్డ్ భూములను అమ్మేసిన వారు కాన్సెంట్ ఇవ్వడం లేదు. తాము అమ్మేశామంటూ సంతకాలు పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఇలాంటివే అత్యధికంగా ఉన్నట్లు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ తహశీల్దార్ అభిప్రాయపడ్డారు. అసైన్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కాన్సెంట్ ఇవ్వకపోతే కష్టమేనంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పట్టా భూములకే ఆ నిబంధన అమల్లో ఉంది. ఇక మిగతా భూములకు అనివార్యంగా మారుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల్లో 90వేల దరఖాస్తులు సైతం క్రమబద్ధీకరించేందుకు అవకాశాలు లేవంటున్నారు.

రూ.10 వేల నుంచి రూ.20 లక్షలు

ఎకరం రూ.10వేలు ఉన్నప్పుడు భూముల క్రయవిక్రయాలు సాదా కాగితంతో అయ్యాయి. ఇప్పుడేమో ఆ ధర రూ.20 లక్షలకు పైగా పెరిగింది. ఈ క్రమంలోనే అమ్మినవారెవరూ కాన్సెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. 1995 నుంచి 2000 మధ్య కాలంలో చోటు చేసుకున్న అమ్మకాలకు 25 నుంచి 30 ఏండ్ల తర్వాత కాన్సెంట్ ఇచ్చి నిజాయితీని చాటుకునే వారి సంఖ్య చాలా తక్కువేనని అంటున్నారు. అలా కాన్సెంట్ ఇచ్చి ఉంటే గతంలోనే రెగ్యులరైజ్ అయి ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. తండ్రి సేల్ డీడ్ ద్వారా అమ్మేస్తే.. తమకు తెలియకుండా అమ్మేశారంటూ వారసులు కోర్టులో కేసులు వేస్తున్న సందర్భంలో నిజాయితీగా అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టే ఔదార్యం ఎంత మందికి ఉంటుందో లెక్క తేలాలంటే ఈ ప్రక్రియ ముగియాల్సిందే.

మళ్లీ.. మళ్లీ అమ్మేసి

20 ఏండ్ల క్రితమే పట్టా భూములను సాదాబైనామాల ద్వారా అమ్మేశారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో వాళ్లే వస్తున్నారు. ఎలాగూ కొనుగోలు చేసిన వ్యక్తి మ్యుటేషన్ చేయించుకోలేదు. దాంతో రైతుభరోసా, రైతు బీమా, రుణమాఫీ వంటి సదుపాయాలు పొందుతున్నారు. పైగా ‘అప్పట్లో రూ.10 వేలు, రూ.20 వేలు తీసుకొని అమ్మాం.. ఇప్పుడది రూ.20 లక్షలైంది’.. అంటూ అమ్మేసిన భూములను మళ్లీ అమ్మేసిన ఉదంతాలు కోకోల్లలుగా ఉన్నాయి. ఎలాగూ రికార్డుల్లో పట్టాదారుడు ఎవరు ఉంటే వాళ్లకే అమ్మే హక్కు ఉంటుంది. ఇన్నాండ్లుగా సాదాబైనామాల కింద అప్లికేషన్లు పెట్టుకున్నా పీవోబీలో నమోదు కాలేదు. దాంతో మరొకరికి అమ్మేశారు. ఫిజికల్ పొషిషన్ లేకపోయినా రెవెన్యూ రికార్డుల్లో అమ్మేసిన వారు లేరు. సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన వారు రికార్డుల్లో ఉన్నారు. అంటే సాదాబైనామాలో అమ్మిన వ్యక్తి పేరు రెవెన్యూ రికార్డుల్లో లేదు. దీంతో ఎవరి కాన్సెంట్ తీసుకోవాలి? అన్నది సందేహంగా మారింది.

వారసుల గేమ్ ప్లాన్

సాదాబైనామా కింద తండ్రి అమ్మేశాడు. ఆ తర్వాత మ్యుటేషన్ కాకపోవడంతో వారసులు గేమ్ ప్లాన్ అమలు చేశారు. తండ్రి చనిపోయి ఉంటే విరాసత్ చేయించుకున్నారు. కొందరేమో ఎలాగూ అమ్మేసిన భూమి అయినప్పటికీ వారసుల పేరిట మార్చుకున్నారు. ఇంకొందరేమో హక్కులు బలంగా ఉండాలని గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ ద్వారా తండ్రి, తాత ఆస్తినే కొనుగోలు చేశారు. ఇలా కూడా దరఖాస్తుల పరిష్కారం సమస్యగా మారుతుందని ఓ తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మేసిన వ్యక్తే కాన్సెంట్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఆయన చనిపోయిన సందర్భాల్లో వారసులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి.

ఇలా అయితే కష్టమే..

2021 అక్టోబర్‌ 18 నుంచి 30వ తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు, మళ్లీ 2020 నవంబర్ 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. అంటే 9 లక్షల్లో 10 శాతం సైతం రెగ్యులరైజ్ చేయడం కష్టంగా మారిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. పైగా కొనుగోలు చేసిన భూముల్లో పట్టా వర్సెస్ అసైన్డ్, అసైన్డ్ వర్సెస్ ఫారెస్ట్ డిస్ప్యూట్ కూడా ఉన్నాయి. దాంతో అంత ఈజీగా పరిష్కారం చేసే అవకాశాలు లేవంటున్నారు. కనీసం ఫీల్డ్ వెరిఫికేషన్, చుట్టు పక్కల రైతుల వాంగ్మూలం ద్వారా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు అనుకూలంగా గైడ్ లైన్స్ మారిస్తే తప్ప ముందుకు సాగదంటున్నారు. దీనిపై సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టి పెట్టాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Next Story