రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పి.ఎం. కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పి.ఎం. కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ, బంజరు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామంలో ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగంలో ఉన్న విద్యుత్‌లో అధిక భాగం బొగ్గు, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతోందని, ఇవి పరిమిత లభ్యత కలిగినవే కాక పర్యావరణానికి హానికరమని ఆయన తెలిపారు. సౌరశక్తి మాత్రం నిరంతరంగా లభించే స్వచ్ఛమైన హరిత శక్తి వనరుగా నిలుస్తోందని, దీని వినియోగం ద్వారా పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

29,645 మెగావాట్ల పునరుద్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యం...

రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 10,642 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉందని, దీన్ని 2029-30 నాటికి 29,645 మెగావాట్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. పి.ఎం. కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో 0.5 మెగావాట్ల నుండి 2.0 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3.5 ఎకరాల భూమి అవసరమవుతుందని, చిన్న, సన్నకారు రైతులు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి గ్రూపులుగా ఏర్పడి కూడా ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ పథకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు కల్పిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా నాలా కన్వర్షన్ మినహాయింపు, 50 శాతం ఎస్జీఎస్టీ రీఫండ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి ఎన్ఓసీ మినహాయింపు, 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత డెమో పంప్‌సెట్‌లు, సౌర విద్యుత్ ప్లాంట్లను పరిశీలించిన సీఎండీ... వాటి పనితీరును రైతులకు వివరించారు. రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఇప్పటికే తమ పొలాల్లో సోలార్ పంప్‌సెట్‌లు ఏర్పాటు చేసుకున్న రైతులు, ఈ పథకం ద్వారా పొందుతున్న ప్రయోజనాలను ఇతర రైతులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మీనారాయణ, ఆర్‌డీఓ అనంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉష పాల్గొన్నారు.

Next Story