అక్టోబర్ కల్లా సోలార్ ప్లాంట్ల పనులు పూర్తి కావాలి

by velandi.Saikiran |

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల పనులు వచ్చే అక్టోబర్ కల్లా పూర్తిచేయాలని, టెండర్

అక్టోబర్ కల్లా సోలార్ ప్లాంట్ల పనులు పూర్తి కావాలి
X

అక్టోబర్ కల్లా సోలార్ ప్లాంట్ల పనులు పూర్తి కావాలి

- జియో థర్మల్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లపై ప్రణాళికలివ్వండి

- పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

- సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల పనులు వచ్చే అక్టోబర్ కల్లా పూర్తిచేయాలని, టెండర్ పనులు ఖరారైన మరో 137 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం వెంటనే ప్రారంభించి ఏడాదిలోగా పూర్తిచేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. మొత్తం 504 మెగావాట్ల సోలార్ సామర్థ్యం సాధించాలని అన్నారు. గురువారం సింగరేణి భవన్‌లో సోలార్ పవర్, ఇతర వ్యాపార విస్తరణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. పనులు నిర్ణీత సమయంలోపు పూర్తిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ఏజెన్సీలను, పర్యవేక్షక అధికారులను హెచ్చరించారు.

అలాగే.. రామగుండంలో చేపట్టనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు నిర్మాణానికి అన్నిరకాల చర్యలు అతివేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఈ ప్లాంట్ పూర్తయితే రోజుకు 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా సింగరేణి సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున జియో థర్మల్ విద్యుత్తుకు మణుగూరు ప్రాంతంలో అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయని, ఓఎన్జీసీతో కలిసి ఇక్కడ అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, ఉమ్మడిగా ప్లాంట్ ఏర్పాటుకు తక్షణమే సన్నాహాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఓపెన్ కాస్ట్ గనుల డంపులపై పవన విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు అధ్యయనం చేయాలన్నారు.

అలాగే మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనితోపాటు ఇతర ఓపెన్ కాస్ట్ గనుల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలపైనా అధ్యయనం చేసి నివేదికలు వెంటనే రూపొందించాలన్నారు. రాజస్థాన్‌లో రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌తో కలిసి అక్కడ 1,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిందని.. త్వరలోనే ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందం అక్కడికి వెళ్లనున్నదని చెప్పారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, జీఎం (సీడీఎన్) ఎస్డీఎం సుభాని, జీఎం (సీపీపీ), మనోహర్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరంజీవులు, పవర్ ప్రాజెక్ట్స్ శాఖ అధిపతి విశ్వనాథరాజు పాల్గొన్నారు.

Next Story