- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 30 వేల యువ రైతులకు సాయిల్ హెల్త్ వాలంటీర్ శిక్షణ: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి సచివాలయం నుంచి హాజరై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా యాప్ పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని, ఇంట్లో నుంచే యూరియాను బుక్ చేసుకోని, ఉచిత సమయంలో తెచ్చుకునేందుకు వీలు కలిగిందని, దీంతో సమయం వృథా కాకుండా ఉందని రైతులు యూరియా యాప్‌ని కొనియాడారు. రాష్ట్రంలో సాగు అవుతున్న వివిధ పంటల్లో విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతిని, పంట దిగుబడులు తగ్గుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని, సిఫార్సుల మేరకు నేల స్వభావానికి అనుగుణంగా శాస్త్రీయంగా ఎరువులు వినియోగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా భూసార పరీక్షల అనంతరం రైతులకు అందించే నేల ఆరోగ్య కార్డులో పొందుపరిచిన వివరాలను సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది యువ రైతులను వాలంటీర్లుగా ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నట్టు, ప్రతి గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అన్ని పంటల్లో పామాయిల్ వేయోచ్చు
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, వాటి ఫలితాల అర్థం చేసుకోవడం, పంటలకు అనుగుణంగా ఎరువుల వినియోగం వంటి అంశాలపై ఈ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందచేస్తున్నామని, రాష్ట్రంలోని రైతు విజ్ఞాన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా కేంద్రాల్లో రోజుకు సుమారు వెయ్యి మందికి శిక్షణ అందిస్తూ, నెలరోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా ల్యాబ్‌లతో పాటు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను వినియోగిస్తూ భూసార పరీక్షలను వేగవంతం చేస్తున్నామన్నారు. దీంతో రైతులు శాస్త్రీయంగా ఎరువులు వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు తాము పండించే అన్ని పంటల్లో పామాయిల్ పంటను కూడా వేయవచ్చని, పామాయిల్ పంటను వేసి కూడా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించుకోవచ్చని వివరించారు. రైతులందరు పామాయిల్ పంటను వేసినట్లయితే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలు ఉంటుందన్నారు.
తుమ్మలను కలిసిన ఆ పాలకవర్గం
సచివాలయంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్ లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రతిపాదించిన డంపింగ్ యార్డు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్ పాల్గొన్నారు.






