ప్రతి గ్రామానికి సాయిల్ హెల్త్ వాలంటీర్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

నేల ఆరోగ్యం కేవలం పంటలకే పరిమితం కాకుండా పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి సాయిల్ హెల్త్ వాలంటీర్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నేల ఆరోగ్యం కేవలం పంటలకే పరిమితం కాకుండా పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని క్షేత్ర స్థాయిలో అమలు చేసే ఉద్యమంగా మారాలన్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం, పర్యావరణ సమతుల్యత, మానవ శ్రేయస్సు సాధ్యమవుతుందని తెలిపారు. సోమవారం పటాన్​చెరులో ఇక్రిశాట్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సంయుక్తంగా రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి సుమారు 120 మంది రైతులు సాయిల్ హెల్త్ వాలంటీర్లుగా శిక్షణ పొందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ రైజింగ్ విజన్‌ 2047లో భాగంగా సాగు ఖర్చులను తగ్గిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, అధిక మోతాదులో వాడే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించి, సేంద్రియ, శాస్త్రీయ మట్టి నిర్వహణ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. పిల్లి పెసర, జీలుగ, జనుము, మినుము, పెసర లాంటి లెగ్యూమీనస్ పంటలను వేసుకొని నేల సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకు తరగతి గది బోధన

శిక్షణలో భాగంగా రైతులకు తరగతి గది బోధనతో పాటు శిక్షణ కూడా అందించబడుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. పొలంలో మట్టి నమూనాలను సేకరించడం నుండి ల్యాబ్‌లో పరీక్షించే విధానం వరకు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నారు. సాయిల్ హెల్త్ కార్డు వివరాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో ఎలా వినియోగించాలో వాలంటీర్లకు నేర్పించానున్నారు. అదనంగా, కంపోస్టింగ్, బయో-ఇన్‌పుట్స్, పంట మార్పిడి వంటి సహజసిద్ధ భూసార పెంపు పద్ధతులపై శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగు విషయంలో ఇక్రిశాట్ ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తోందని, శాస్త్ర విజ్ఞానాన్ని రైతుల దరి చేరవేయడమే లక్ష్యంగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాదిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మట్టి నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించి, 100 శాతం రిపోర్టులు ఇవ్వడం జరిగిందని చెప్పారు.

ప్రతి రెవెన్యూ గ్రామంలో మట్టి పరీక్షలు

ఈ సంవత్సరంలో 4 లక్షల నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో మట్టి పరీక్షలు నిర్వహించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి గ్రామానికి సాయిల్ హెల్త్ వాలంటీర్లను ఎంపిక చేసి, 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి రైతులకు నేల ఆరోగ్యంపై వారికి అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రైతు నేస్తం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆదర్శ రైతుల విజయగాధలను వీడియోలను ప్రదర్శించాలని నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా కొడంగల్ నియోజకవర్గం వాలంటీర్లు తమ గ్రామాలలోని ఇతర రైతులకు నేల యాజమాన్యం పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, తమ భూముల సారాన్ని పరిరక్షించుకునే దిశగా చర్యలు చేపట్టి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా హిమాన్ష్ పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా స్టాన్ఫోర్డ్ బ్లేయిడ్, అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ , ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డా రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story