మానసిక వైకల్యం ఉన్న చిన్నారులపై బాధ్యత సమాజానిదే: మంత్రి దామోదర రాజనర్సింహ

by Malleboina Mahesh |

మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.

మానసిక వైకల్యం ఉన్న చిన్నారులపై బాధ్యత సమాజానిదే: మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ‘సాధన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్’ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిల్లలతో మంత్రి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, వారి అభిరుచులు, రోజువారీ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు.

వారితో కలిసి నవ్వుతూ మాట్లాడి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. 1996 నుంచి మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, వృత్తి శిక్షణ, పునరావాస సేవలు అందిస్తున్నామని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు. మానసిక దివ్యాంగ చిన్నారులకు అంకితభావంతో సేవలు అందిస్తున్న సాధన ఫౌండేషన్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పిల్లల జీవితంలో తొలి ఐదేళ్ల కాలం అత్యంత కీలకమైనదని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తుచేశారు.

"ఈ తొలి ఐదేళ్ల దశలోనే శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి సకాలంలో తగిన చికిత్స, థెరపీ అందిస్తే వారి సమస్య తీవ్రతను తగ్గించి భవిష్యత్తును మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తోంది" అని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీ స్థాయి నుంచే చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన వైద్య సేవలు, థెరపీ, పునరావాసం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మానసిక ఎదుగుదల లోపాలు ఉన్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు, విద్యను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు.

Next Story