దమ్ముంటే టచ్ చేసి చూడండి.. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్

by Prasad Jukanti |

మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌తో వాగ్యుద్ధం మొదలైంది.

దమ్ముంటే టచ్ చేసి చూడండి..  బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తుంటే పార్టీ గుర్తులతో జరగబోయే ఈ ఎన్నికల్లో అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో మెరుగుపడినట్లే పురపోరులోనూ తమ బలమేంటో చూపిస్తామని బీజేపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ లడాయి ఆసక్తిని రేపుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సరికొత్త వార్‍కు (Social Media War) తెరలేపింది. నిన్న ఖమ్మం సభలో గ్రామాల్లో బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలంటూ టీడీపీని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress), టీడీపీ (TDP) మద్దతుదారుల మధ్య బిగ్ ఫైట్ మొదలైంది.

టచ్ చేసి చూడు..

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని కక్ష గట్టి దెబ్బతీసిన బీఆర్ఎస్‍ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి బొందపెట్టాలని ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూల్చాలని ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అనుచరులు సహచరులకు సీఎం చేసిన విజ్ఞప్తి రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. BRS పార్టీ జోలికి వస్తే తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ భవన్, గాంధీ భవన్ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ భవన్, గాంధీ భవన్ ను కూల్చివేసినట్లు ఇందుకు ఏఐ జనరేటెడ్ ఇమేజ్‍లను పోస్టు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సపోర్టర్లు చేస్తున్న ఈ పోస్టులకు కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారులు కౌంటర్లు మొదలు పెట్టారు. దమ్ముంటే ఎన్టీఆర్ భవన్ టచ్ చేసి చూడాలని, ఎన్టీఆర్ భవన్ గేట్ తాకేలోపే తెలంగాణ భవన్ నేల మట్టం అయితదని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తుంటే గాంధీ భవన్ మీద చెయ్యి వేసేంత సీన్ మీకు లేదంటూ హస్తం పార్టీ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య వాగ్యుద్ధానికి కారణం కాగా మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఎటువైపుకు దారి తీస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

Next Story