జై బాపు, జై భీమ్, జై సంవిధాన్: నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సభ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-04 02:26:02  IST  )

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా సామాజిక న్యాయ సమర భేరి బహిరంగ సభ జరుగనుంది.

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్: నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సభ
X

హైదరాబాద్, దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా సామాజిక న్యాయ సమర భేరి బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు నేతలు హాజరవుతారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ కేడర్‌ ను సమీకరించడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికయ్యాక తొలిసారిగా గాంధీ భవన్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖర్గే గాంధీ భవన్‌లో ఉదయం పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని నేతలకు మార్గదర్శనం చేయనున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పార్టీ కృషి ప్రారంభం కానుంది.

ఖర్గేతో అసంతృప్తుల భేటీ

ఇక ఖర్గే హైదరాబాద్ చేరిన తర్వాత ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆయనతో వన్ టు వన్ భేటీ అయ్యారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాక అసంతృప్తి చెందిన ప్రేమ్ సాగర్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలూ నాయక్‌లు మంత్రి పదవులు ఇవ్వాలంటూ ఖర్గేతో డిమాండ్ చేశారు. ప్రేమ్ సాగర్ రావుకు చీఫ్ విప్ పదవి ప్రతిపాదించగా, ఆయన తిరస్కరించి అసంతృప్తిగా వెళ్లిపోయినట్టు సమాచారం. మల్‌రెడ్డి పది జిల్లాలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని వాదించగా, బాలూ నాయక్ తన వర్గానికి న్యాయం చేయాలని కోరారు.

పార్టీ కీలక నేతలతో ఖర్గే భేటీ

రాత్రి హోటల్ తాజ్ కృష్ణాలో ఖర్గే.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, బీసీ రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story