కర్రీ పఫ్ లో పాము

by Muthe.Rajitha |

పిల్లలు అడిగారని బేకరీకి వెళ్లి పఫ్ లు కొని తింటుండగా అందులో పాము పిల్ల బయట పడటంతో షాక్ తిన్నారు.

కర్రీ పఫ్ లో పాము
X

దిశ, జడ్చర్ల : పిల్లలు అడిగారని బేకరీకి వెళ్లి పఫ్ లు కొని తింటుండగా అందులో పాము పిల్ల బయట పడటంతో షాక్ తిన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకినగర్లో నివాసం ఉంటున్న శ్రీశైల అనే మహిళ తన పిల్లలు స్కూల్ వదిలాక ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో పిల్లలు పఫ్ లు అడిగారు. దీంతో ఆ మహిళ జడ్చర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీలో రెండు ఎగ్ పఫ్ లు, రెండు కర్రీ పఫ్ లు తీసుకొని ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి తింటుండగా.. కర్రీ పఫ్ ను తెరిచి చూడగా అందులో చిన్న పాము పిల్ల కనబడింది.

దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆగ్రహంతో బేకరీ యజమానిని నిలదీయగా.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేనని, ఇలా చాలాసార్లు వస్తుంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ... ఆ మహిళ వద్ద నుండి పాము పిల్ల ఉన్న కర్రీ పఫ్ ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ అదే కర్రీ పఫ్ తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనుకున్న పోలీసులు వెంటనే బేకరీ వద్దకు చేరుకొని, ఆహార పదార్థాలను పరిశీలించచారు. కేసు నమోదు చేసుకుని, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందించారు.

కాగా పఫ్ లో పాము బయటపడిందన్న వార్త తెలుసుకొని జడ్చర్ల పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని చాలా బేకరీలో ఎలాంటి పరిశుభ్రత లేకుండా అపరిశుభ్రంగా ఉంటున్నాయని, ఇలాంటి బేకరీల పై ఫుడ్ అధికారుల నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సదరు బేకరిని శాశ్వతంగా మూసివేయాలని, యజమానిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Next Story