స్కైరూట్ 'విక్రమ్-1' విజయం తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |

స్కైరూట్ 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఈ చారిత్రాత్మక విజయం తెలంగాణకే గర్వకారణమన్న ముఖ్యమంత్రి!

స్కైరూట్ విక్రమ్-1 విజయం తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటాల్-క్లాస్ ప్రయోగ వాహనం 'విక్రమ్-1' (Vikram-1)ను విజయవంతంగా పరీక్షించింది. దీంతో హైదరాబాద్ స్పేస్-టెక్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్'కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 'మిషన్ ఆగమన్'లో భాగంగా నిర్వహించిన ఈ టెస్ట్ ఫ్లైట్-1 విజయం.. భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న స్కైరూట్ 'మ్యాక్స్-క్యూ క్యాంపస్‌'ను సందర్శించినప్పుడు, తానే స్వయంగా విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోట తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించానని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ సాధించిన ఘన విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమని, భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ విజయంతో ఏరోస్పేస్ ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగానికి తెలంగాణ అనువైన గమ్యస్థానంగా మారిందని, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఇదొక కీలక మైలురాయి అని చెప్పారు. స్కైరూట్ వంటి సంస్థల విజయాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం తో పాటు యువతలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించి, భావితర ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Next Story