RRR నార్త్ కారిడార్‌లో ఆరు లేన్లు.. సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

by Kema Shiva Kumar |

రిజినల్ రింగ్ (త్రిపుల్ ఆర్)​రోడ్డుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడింది.

RRR నార్త్ కారిడార్‌లో ఆరు లేన్లు.. సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిజినల్ రింగ్ (త్రిపుల్ ఆర్)​రోడ్డుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడింది. ఉత్తర భాగం వైపు రోడ్డు పనులకు నిర్వహించిన ట్రాఫిక్ సర్వే శాస్త్రీయంగా లేకపోవడం, పలు రకాల సర్వేలను పేర్కొనాల్సి ఉండగా ఇవేవీ పట్టించుకోకుండా పైపైనే తంతు పూర్తిచేయడంతో నేషనల్ హైవే అధికారులు ఆమోదించడానికి సంకోచించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ తక్కువగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. ఉత్తర భాగం త్రిపుల్ ఆర్ కు కేంద్రం నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి అంగీకరించి, పనులు చేపట్టేందుకు 2024 డిసెంబర్ లో టెండర్లు పిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పునరాలోచన చేయాలని అధికారులకు సూచించింది. భవిష్యత్​అవసరాల దృష్ట్యా కనీసం ఆరు లేన్లు ఉండేలా చూడాలని, అందుకు అనుగుణంగా శాస్త్రీయంగా సర్వేచేయాలని సూచించింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. వివిధ రకాల సర్వేలను పరిగణలోకి తీసుకున్నారు. వాహనాల రద్దీ విపరీతంగా ఉన్నట్లు, భవిష్యత్​లో ఇంకా ఎక్కువగా పెరుగుతుందని తేల్చారు. దీంతో ఆరు లేన్ల రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నాలుగు వరుసలు ఉన్న త్రిపుల్ ఆర్ రహదారిని ఆరు లేన్లకు పెంచుతూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భారీగా పెరిగిన వ్యయం

త్రిపుల్ ఆర్ ఆరు లేన్ల పనులకు తాజాగా అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ ప్రక్రియ హైవే ఆథారిటీ విభాగం వద్ద ఉంది. ఇక్కడ ఆమోదం తర్వాత మినిస్ట్రీ ఆఫ్​రోడ్​ట్రాన్స్​పోర్ట్(ఎంవోఆర్టీ) వద్ద ఆమోదం పొంది కేంద్ర కేబినెట్​ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఇది పూర్తయితే ఇప్పటి వరకు పిలిచిన నాలుగు లేన్ల టెండర్లు రద్దవుతాయి. ఆరు వరుసల రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తారు. కేంద్రం, రాష్ట్రం, జాతీయ రోడ్ల విభాగం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాక రాష్ట్రస్థాయిలో భూ సేకరణపై గెజిట్​విడుదల చేస్తారు.

భూ సేకరణ దాదాపు పూర్తి

త్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 90శాతం భూసేకరణ పూర్తయింది. చిన్న చిన్న సమస్యలతో సుమారు 10 శాతం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే కేంద్రం, రాష్ట్రం, జాతీయ రోడ్ల విభాగం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న తర్వాతే అధికారికంగా గెజిట్ విడుదల చేస్తారు. అప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఉత్తరభాగం పనులతో పాటు దక్షిణ భాగం పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 201 కిలోమీటర్లతో దక్షిణ భాగానికి క్యాబినెట్​ఇప్పటికే ఆమోదించింది. ఈ ప్రక్రియ పూర్తయితే త్రిపుల్ ఆర్ పనులు ఊపందుకోనున్నాయి.

Next Story