కాల్పుల ఘటన‌పై ‘సిట్’ ఫోకస్.. కొనసాగుతోన్న విచారణ

by Kema Shiva Kumar |

మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరం. 100 సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరణ. కాల్పుల ఘటనపై టెక్నికల్ ఎవిడెన్స్. కస్టడీ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టులో 23న విచారణ

కాల్పుల ఘటన‌పై ‘సిట్’ ఫోకస్.. కొనసాగుతోన్న విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్ పార్టీపై నమోదైన కేసులో సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఒకవైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారనే కోణంలో విచారణ జరుగుతుండగా, మరోవైపు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడానికి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఏప్రిల్ 4 తర్వాతే విచారణకు అందుబాటులోకి ఉంటానని తెలపడం గమనార్హం. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఎన్‌డీపీఎస్ (NDPS) యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, మరియు బీఎన్ఎస్ (BNS) చట్టాల కింద మొత్తం 12 సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేసి, దర్యాప్తు కోసం సిట్ (SIT) ఏర్పాటు చేశారు.

‘రోహిత్ రెడ్డి పిలిస్తేనే వచ్చాం’..

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని మంగళవారం సాయంత్రం నుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం కూడా సుమారు 8 గంటల పాటు విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. నిందితులుగా ఉన్న కౌశిక్ రవి, శరత్ కుమార్, అర్జున్ రెడ్డి, రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణలను విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వారందరూ రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీకి వచ్చినట్లు తెలిపారు. అందరూ ఒకేసారి కాకుండా, 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి వివిధ సమయాల్లో ఫామ్ హౌస్‌కు చేరుకున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో నిందితులను అడిక్షన్ సెంటర్లకు రిఫర్ చేస్తామని సిట్ అధికారులు ప్రతిపాదించగా, నిందితులు దానిని నిరాకరించినట్లు ఈగల్ టీమ్ అధికారులు తెలుపుతున్నారు.

సీసీ కెమెరాల ఫుటేజీపై నిఘా..

సిట్ అధికారులు మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్రాంతంలోని సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. కాల్పుల ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాలు, ఫామ్ హౌస్‌ల సీసీ ఫుటేజీని సేకరించేందుకు నోటీసులు అందజేశారు. సుమారు 100 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. రోహిత్ రెడ్డి సోదరుల ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు నిర్ధారించేందుకు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సిట్ భావిస్తోంది. ఉప్పరపల్లి కోర్టులో దాఖలైన కస్టడీ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగగా, కోర్టు దానిని ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

డ్రగ్స్ కొనుగోలుపై విచారణ

డ్రగ్స్ కొనుగోలు అంశంపై సిట్ ప్రధానంగా విచారణ చేపట్టింది. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్‌ను విచారించిన క్రమంలో, హైదరాబాద్‌కే చెందిన అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం అందింది. ఫామ్ హౌస్‌లో మూడు రకాల డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించిన సిట్, వాటిని ఎవరెవరు సరఫరా చేశారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది.

Next Story