- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone tapping case: వాట్సాప్ కాల్స్‌పై సిట్ ఫోకస్! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయమంతా ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) చుట్టూ తిరుగుతోంది. సీపీ సజ్జనార్ నేతృత్వంలో రెండో సిట్ (SIT) ఏర్పాటు తర్వాత విచారణ మరింత ఊపందుకుంది. ఇప్పటి వరకు అధికారులు, చిన్న లీడర్ల చుట్టూ సాగిన దర్యాప్తు ఇప్పడు బీఆర్ఎస్‍లోని పెద్ద తలకాయల చుట్టూ నడుస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించిన సిట్ తాజాగా ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు.. ఇక వాట్సాప్ (WhatsApp) కాల్స్ డేటాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాట్సాప్ ద్వారా ఎవరెవరు ఎవరిని సంప్రదించారనే విషయంలో నిఘా పెట్టారనే కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిట్ అధికారులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డివైజ్ రికార్డ్స్ కోసం ఇంటర్నెట్ ప్రొవైడర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతా ఆయన కనుసన్నల్లోనే..!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కారణంగా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పాటు పలువురు ఉన్నతాధికారులు నార్మల్ కాల్స్ మాట్లాడేందుకు సంకోచించారనేది బహిరంగ రహస్యమే. తమ ఫోన్లపై నిఘా ఉంచారనే కారణంతో తాము వాట్సాప్, ఫేస్ కాల్, సిగ్నల్ యాప్‍లలో సంభాషించుకోవాల్సి వస్తోందని పలువురు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. చాలా మంది సాధారణ ఫోన్ కాల్స్‌కు బదులు వాట్సాప్ వంటి యాప్స్ ద్వారా సమాచార మార్పిడి చేసుకుంటున్నారని పసిగట్టి ఆ దిశగా కూడా గత ప్రభుత్వంలోని పాలకులు, అధికారులు నిఘా పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 600 నంబర్లకు సంబంధించిన వాట్సాప్ కాల్స్‌పై నిఘా ఉంచారని తెలుస్తోంది. ఇదంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) కనుసన్నల్లోనే జరిగిందని, దీంతో ప్రభాకర్‌రావు ఎంత మందితో మాట్లాడారు..? వారిలో రాజకీయ నేతలు ఎవరున్నారు..? అనే దానిపై సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్‍లో టెన్షన్..!
ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‍ను విచారించిన సిట్ బృందం అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి పంపించేశారు. అయితే ఇంతకాలం అధికారులు, చోటా లీడర్ల వరకు పరిమితమైన సిట్ ఇప్పుడు ఏకంగా అగ్రనేతల జోలికి రావడంతో సిట్ తదుపరి టార్గెట్ ఎవరు అనేది బీఆర్ఎస్‍లో టెన్షన్‍గా మారింది. ఒకరి తర్వాత ఒకరిని పిలవడం వారిచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా దర్యాప్తును మరింత స్పీడ్‌తో ముందుకు తీసుకువెళ్తుండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. తాము ఎలాంటి తప్పు చేయకున్నా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే తప్పు చేయకుంటే భయమెందుకని అధికార కాంగ్రెస్ రివర్స్ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు పాలిటిక్స్‌లో కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.






