ఒంటరిగానే నయం.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ‘సింగిల్ ఉమెన్’

by Ramesh Naini |

దేశంలో తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న (విడాకులు, భర్త మరణం లేదా దూరంగా ఉండటం) మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఒంటరిగానే నయం.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ‘సింగిల్ ఉమెన్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న (విడాకులు, భర్త మరణం లేదా దూరంగా ఉండటం) మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) - 2024’ నివేదిక స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో ఒంటరి పురుషులు 1.6% ఉంటే, మహిళల సంఖ్య ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువగా 5.4% గా నమోదైంది.

దక్షిణాది ముందంజ..

దేశవ్యాప్తంగా ఒంటరి మహిళల జాబితాలో తమిళనాడు (11.6%) తొలి స్థానంలో ఉండగా, కేరళ (10.4%), కర్ణాటక (8.6%) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పురుషులతో పోలిస్తే మహిళలే 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఒంటరి మహిళలు 8.0% ఉంటే, పురుషులు 2.1% మాత్రమే ఉన్నారు. తెలంగాణలో ఒంటరి మహిళలు 7.6% కాగా, పురుషులు కేవలం 1.6% గా ఉన్నారు.

కారణాలు ఏమిటి?

మహిళల్లో పెరిగిన విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యమే ఈ మార్పునకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థికంగా స్థిరపడిన మహిళలు వైవాహిక జీవితంలో రాజీపడి జీవించేందుకు ఇష్టపడకపోవడం, అలాగే పురుషుల్లో ఆయుర్దాయం తక్కువగా ఉండటం వంటివి కారణాలుగా తెలుస్తున్నాయి.

తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు (TFR)

జనాభా సమతుల్యంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 2.1 ఉండాలి. కానీ, దేశ సగటు 1.9 కు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఏపీలో ఈ రేటు 1.4 కు, తెలంగాణలో 1.5 కు పడిపోయింది. (బీహార్-2.9, యూపీ-2.6 గా నమోదయ్యాయి).

నగరాల్లోనే పిల్లలు ఎక్కువ..

సాధారణంగా దేశవ్యాప్తంగా పట్టణాల (20.9%) కంటే పల్లెల్లోనే (25.6%) పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ, ఢిల్లీ, తెలంగాణలో దీనికి భిన్నమైన వాతావరణం ఉంది. తెలంగాణ పల్లెల్లో 0-14 ఏళ్ల పిల్లల వాటా 19.8% కాగా, నగరాల్లో 21.2% గా ఉంది. ఇక ఏపీలో పల్లెలు, పట్టణాల్లో సమానంగా 19% ఉన్నారు.

బాల్య వివాహాలు.. పెళ్లి వయసు

దేశవ్యాప్తంగా ఇంకా 2.1% మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ (6.3%) ఇందులో అగ్రస్థానంలో ఉంది. కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ సంఖ్య దాదాపు సున్నా. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు కాస్త ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. జాతీయ సగటు వివాహ వయసు 23.1 ఏళ్లు కాగా, కేరళలో ఇది 24.5 ఏళ్లుగా ఉంది.

Next Story