Niranjan Reddy: ప్రభుత్వానికి బాధ్యత లేదు.. బాధ అంతకంటే లేదు

by Gantepaka Srikanth |

వ్యవసాయ రంగం, రైతులపై ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని.. బాధ అంతకన్నా లేదని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Niranjan Reddy: ప్రభుత్వానికి బాధ్యత లేదు.. బాధ అంతకంటే లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ రంగం, రైతులపై ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని.. బాధ అంతకన్నా లేదని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణంతో మరణించినా రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం అందించామని.. ఏడు పనిదినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది అని తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా రూ.5,909.85 కోట్లు పరిహారంగా అందించడం జరిగిందన్నారు. రైతుబీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,122.65 కోట్లు ఎల్ఐసీకి ప్రీమియంగా చెల్లించిందని చెప్పారు. ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో 440కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి పరిహారం అందలేదని పేర్కొన్నారు. కరెంటు రాదు, నీళ్లు రావు, రైతుబంధు పడదు, రైతు బీమా ప్రీమియం చెల్లించరు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తున్నది? అని ప్రశ్నించారు.

అభయహస్తంలో వ్యవసాయానికి రూ.3 లక్షల వడ్డీ లేని రుణం అన్నారని, 24 గంటల కరెంటు అన్నారని, వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీలను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారని చెప్పారు. యాసంగి సీజన్ మొదలయ్యే సమయానికి సమీక్ష చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖల మంత్రులు ధైర్యం ఉంటే పంటలు ఎండుతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండడం లేదని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని రాహుల్ సమక్షంలో ప్రకటించిన కాంగ్రెస్.. దానిని పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

Next Story