కేసీఆర్ విజయాలపై బురదజల్లే ప్రయత్నం

by velandi.Saikiran |

కేసీఆర్ సాధించిన విజయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

కేసీఆర్ విజయాలపై బురదజల్లే ప్రయత్నం
X
  • కేసీఆర్ విజయాలపై బురదజల్లే ప్రయత్నం
  • - పాలన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి
  • - ప్రాణహితకు అనుమతులు సాధించని కాంగ్రెస్
  • - ఆచరణకు సాధ్యం కాని ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు
  • - మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సాధించిన విజయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పాలన చేతకాక రేవంత్‌రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్లకు ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నించారు. అమలు సాధ్యం కాని ప్రాజెక్టును అమల్లోకి తెచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

నీళ్లు లేని చోట కాంగ్రెస్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని.. ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టారని ఆరోపించారు. కేవలం 16 టీఎంసీల ప్రాజెక్టుతో లాభం లేదని ఉద్యమ సమయంలోనే చెప్పామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీటి అవసరం తీరుతుందని చెప్పారు. అందుకే కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుంచే కాంగ్రెస్‌ విషం చిమ్ముతూనే వచ్చిందని అన్నారు. మంత్రి మండలి, నిపుణులు, కేంద్ర జలసంఘం సూచనలు, పొరుగు రాష్ట్రం అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగిందని తెలిపారు. అత్యంత వేగంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి సాగునీరందించామన్నారు. ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగిందని చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినంక రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదని తెలిపారు. తప్పుడు ఆరోపణలతోనే కమిషన్‌ వేశారని.. కమిషన్‌ ముందుకు కేసీఆర్‌ను పిలిచి ఏదో తక్కువ చేయాలని చూశారని పేర్కొన్నారు. కమిషన్‌ కేసీఆర్‌ను సాక్షిగానే పిలిచిందని.. కమిషన్‌పై భవిష్యత్‌లో కోర్టుకు వెళ్తామని చెప్పారు. రెండు పిల్లర్లు కుంగితేనే కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేసిందని.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోకుండా కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం, కేఎల్‌ఐలో పంపులు మునిగిపోతే కమిషన్ ఎందుకు వేయలేదని నిలదీశారు.

Next Story