బొగ్గు గ్యాసిఫికేషన్‌కు సింగరేణి రెడీ.. కిషన్‍రెడ్డితో భట్టి విక్రమార్క

by Prasad Jukanti |

ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్, కొత్త బ్లాకులపై చర్చించారు.

బొగ్గు గ్యాసిఫికేషన్‌కు సింగరేణి రెడీ..  కిషన్‍రెడ్డితో భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఆ దిశగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో సమావేశమైన భట్టి విక్రమార్క ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు గ్యాసిఫికేషన్ అవకాశాలు, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు. కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే, సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోందని భట్టి తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడంతో పాటు, ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారం అందించాలని కోరారు.

కొత్త బొగ్గు వనరులు సమీకరణ:

సింగరేణి దక్షిణ భారతదేశ బొగ్గు సరఫరా, విద్యుత్ రంగ అవసరాల తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణికి కొత్త బొగ్గు వనరుల సమీకరణ అత్యవసరమని తెలిపారు. బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ పరిధిలోని కొయ్యగూడెం బ్లాక్–III తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఈ బ్లాక్ వేలంలో కేటాయించబడినప్పటికీ నాలుగేళ్లు గడిచినా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కొయ్యగూడెం బ్లాక్–IIIను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

త్వరలో సంయుక్త సమావేశం:

తాడిచెర్ల కోల్ బ్లాక్–II అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ బ్లాక్‌కు సంబంధించి సింగరేణి ఇప్పటికే ప్రీ-మైనింగ్ కార్యకలాపాలు, అన్వేషణ పనులు చేపట్టిందని, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. తాడిచెర్ల కోల్ బ్లాక్–II అభివృద్ధి సింగరేణి భవిష్యత్ అవసరాలకు, తెలంగాణ విద్యుత్ భద్రతకు కీలకమని చెప్పారు. తాడిచెర్ల కోల్ బ్లాక్–IIకు MMDR చట్టం, 1957లోని సెక్షన్–5 కింద ముందస్తు అనుమతి మంజూరు చేసి, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ అంశాలపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రణాళికలు, కొయ్యగూడెం బ్లాక్–III కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్ అంశాలపై సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story