మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే తగ్గాల్సిన అవసరం ఉంది.. సింగరేణి MD కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గాల్సిన అవసరం ఉందని అలా జరిగితే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు మరిన్ని నూతన పథకాలను ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని సింగరేణి సీఎండి ఎన్.బలరామ్ అన్నారు.

మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే తగ్గాల్సిన అవసరం ఉంది.. సింగరేణి MD కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గాల్సిన అవసరం ఉందని అలా జరిగితే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు మరిన్ని నూతన పథకాలను ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని సింగరేణి సీఎండి ఎన్.బలరామ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌తో జరిగిన 38వ నిర్మాణాత్మక సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకం ధరలు కోల్ ఇండియా ధరల కన్నా, విదేశీ బొగ్గు ధరతో పోల్చితే ఎక్కువగా ఉంటున్నాయని, కనుక మన బొగ్గుకు క్రమంగా డిమాండ్ తగ్గుతోందని, ఇది చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు.

భూగర్భనుల్లో ఉత్పత్తి వ్యయం టన్నుకు 12 నుంచి 16 వేల రూపాయలకు చేరుకుంటుందన్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిగా వినియోగించాలన్నారు. నేడు ప్రపంచం థర్మల్ విద్యుత్ నుండి సోలార్ విద్యుత్తు, ఇతర గ్రీన్ ఎనర్జీ విధానాల వైపు అడుగులు వేస్తోంది కనుక సింగరేణి సంస్థ కూడా తన మనుగడ కోసం సోలార్ విద్యుత్తు, కీలక ఖనిజాల ఉత్పత్తి వంటి వ్యాపార విస్తరణ చర్యలను చేపట్టాల్సి వస్తోందని సీఎండి బలరాం అన్నారు. కార్మిక సంఘాలు కంపెనీ ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని కార్మికుల్ని చైతన్య పరచాలని.. కంపెనీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తుంటారని, కంపెనీ అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతనిస్తే సింగరేణికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గతంలో సింగరేణి సంస్థను కష్టాల నుండి కాపాడడానికి కార్మికులు ఎన్నో త్యాగాలు చేశారని, ఇప్పుడు కూడా కంపెనీని అగ్రస్థానంలో నిలపడానికి కార్మికులు తమ వంతు కృషి చేస్తారన్నారు. అయితే కేవలం కంపెనీ ఉత్పత్తిని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా కార్మిక సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని రూపొందించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని కూనంనేని సాంబశివరావు కోరారు. కాగా, ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

మళ్లీ సంస్థ చైర్మన్, ఎండీ బలరామ్ మాట్లాడుతూ.. గుర్తింపు కార్మిక సంఘం ద్వారా వివరించిన సమస్యలపై చర్యలు తీసుకుంటామని, ఆర్థిక పరమైన సమస్యలపై కమిటీలు వేసి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో సింగరేణి తరఫున ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదనకు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా కార్మికులకు సొంత ఇంటి పథకం సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్.వి.సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు(పి అండ్ పి), ఈడీ(కోల్ మూమెంట్) ఎస్ డి.ఎం.సుభానీ, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవితా నాయుడు, జీఎంలు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ శ్రీ రాజ్ కుమార్‌తో పాటు వివిధ ఏరియా నుండి హాజరైన గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు అనేక ఉత్పత్తి సంబంధ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.

Next Story