సింగరేణికి సీపీఎస్‌యూ హోదా తొలగింపు.. వేలంతో పెరిగిన కష్టాలు

by Naga Rani Yarlagadda |

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌యూ) హోదా తొలగించడం ద్వారా సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణికి సీపీఎస్‌యూ హోదా తొలగింపు.. వేలంతో పెరిగిన కష్టాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌యూ) హోదా తొలగించడం ద్వారా సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు, చట్ట సవరణల వల్ల సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సింగరేణికి సీపీఎస్‌యూ హోదాను ఎప్పుడు తొలగించారు? ఎందుకు తొలగించారు? దీనివల్ల సంస్థకు జరిగిన నష్టాలేంటి? అనే అంశాలపై ప్రత్యేక విశ్లేషణ.

హోదాను ఎందుకు తొలగించారు?..

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశీయ బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు, అలాగే వాణిజ్యపరమైన బొగ్గు తవ్వకాలను (కమర్షియల్ మైనింగ్) ప్రోత్సహించేందుకు వీలుగా 2015లో కేంద్ర బొగ్గు గనుల చట్టం (ఎంఎంఆర్డీ యాక్ట్)లో కీలక సవరణలు తీసుకువచ్చింది. ఈ సవరణల ప్రకారమే, గతంలో ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ పద్ధతిలో నేరుగా గనులను కేటాయించే విధానానికి స్వస్తి పలికారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటాలు (షేర్ హోల్డింగ్) ఉన్నాయి. ఇది సంయుక్త భాగస్వామ్య సంస్థ అయినప్పటికీ, కేంద్రం తెచ్చిన నూతన నిబంధనల ప్రకారం 2018లో సింగరేణిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌యూ) పరిధి నుంచి మినహాయించారు. బొగ్గు బ్లాకులను కేవలం బహిరంగ వేలం (ఆక్షన్) ద్వారా మాత్రమే దక్కించుకోవాలనే నిబంధనను 2021-22 నాటి నుంచి మరింత కఠినతరం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే బొగ్గు గనులను కూడా వేలంలో పెట్టడం ద్వారా సింగరేణికి ఉండే ప్రత్యేక ప్రాధాన్యతను కేంద్రం క్రమంగా తొలగించింది.

సింగరేణికి కలిగిన నష్టాలు..

సింగరేణికి సీపీఎస్‌యూ హోదాను దూరం చేసి, ఓపెన్ ఆక్షన్ విధానాన్ని తీసుకురావడం వల్ల సంస్థ ఆర్థికంగా, భౌగోళికంగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటోందని సింగరేణి వర్గాలు తెలిపాయి. గోదావరి లోయ పరీవాహక ప్రాంతంలో సింగరేణికి చట్టబద్ధంగా దక్కాల్సిన బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. ఇందులో ముఖ్యంగా కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3 గనులు ఉన్నాయి. ఈ రెండు బ్లాకుల్లో దాదాపు 99 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.

వేల కోట్ల ఆదాయానికి గండి..

మార్కెట్ విలువ ప్రకారం కోయగూడెం, సత్తుపల్లి బ్లాకుల్లోని బొగ్గు విలువ వరుసగా రూ.29,106 కోట్లు, రూ.10,032 కోట్లుగా అంచనా. ఈ గనులు చేజారడం వల్ల సింగరేణి సంస్థకు రావాల్సిన సుమారు రూ.22,000 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. 2013 లోనే యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన తాడిచెర్ల-2 బొగ్గు గని మైనింగ్ లీజు అనుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవలే దానికి క్లియరెన్స్ లభించింది. కొత్త గనుల కేటాయింపులు సకాలంలో జరగకపోతే భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల సృష్టి నిలిచిపోవడంతోపాటు ప్రస్తుత కార్మికుల ఉపాధి భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

గోదావరి బేసిన్ గనులన్నీ సింగరేణికే ఇవ్వాలి..

- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, తెలంగాణ బొగ్గు గని కార్మికుల చెమట చుక్కలతో నిర్మితమైన ప్రజా ఆస్తి. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే సింగరేణిపై ప్రేమ ఉంటే, దానికి తక్షణమే పాత సీపీఎస్‌యూ హోదాను పునరుద్ధరించాలి. ప్రైవేట్ సంస్థలు మైనింగ్ ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసిన కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను తిరిగి సింగరేణికే కేటాయించాలి.

Next Story