కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి... పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

by Ajay Maddhiboyina |

సింగ‌రేణి సంస్థ‌ను బ‌హుముఖంగా విస్త‌రించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సిఎండి డా. బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి తెలిపారు.

కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి... పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగ‌రేణి సంస్థ‌ను బ‌హుముఖంగా విస్త‌రించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సిఎండి డా. బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డా. నాగులపల్లి శ్రీ‌కాంత్ తో జరిగిన సమావేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌పై సింగరేణి చేపడుతున్న చర్యలను సీఎండీ వివరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ... సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) అధ్యయనం నిర్వహించిందని తెలిపారు.

ప్రస్తుతం ప్రాజెక్టు పెట్టుబడిపై రాబడి ఆశాజనకంగా లేనందున, దానిని మరింత మెరుగుపరిచేందుకు ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' వినియోగం, అలాగే స్వదేశీ సాంకేతికతను వాడటం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని తాల్చేర్, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్, జేఎస్పీఎల్ తదితర కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అధ్యయనం చేయడానికి ఈ నెలలోనే సింగరేణి అధికారుల బృందం పర్యటించనున్నట్లు సీఎండీ వెల్లడించారు. అలాగే భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అవకాశాలపై సాంకేతిక-ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోందన్నారు.

బెల్లంపల్లిలో పైలట్ ప్రాజెక్టు...

అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) విషయంలో కూడా బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని లోతైన బొగ్గు నిల్వల్లో ఐదు బ్లాక్‌లను గుర్తించినట్లు సీఎండీ బుద్దప్రకాష్ తెలిపారు. ఇందులో భాగంగా తొలి పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్లో చేపట్టేందుకు డ్రిల్లింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీఎంఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సింగరేణి డైరెక్ట‌ర్లు ఎల్వీ సూర్య‌నారాయ‌ణ‌, కె.వెంక‌టేశ్వ‌ర్లు, గౌతమ్ పోట్రు, ఈడీ బి. వెంకన్న, జీఎంలు టి.శ్రీనివాస్, జి.దేవేంద‌ర్‌, రాందాస్‌, వెంక‌ట‌ర‌మ‌ణ‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story