సింగరేణి సీఎండీ బలరామ్ కు ఐఐఐఈ పర్ఫార్మెన్స్ ఎక్స్​లెన్స్ ​పురస్కారం

by Muthe.Rajitha |

బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ సీఎండీ ఎన్.బలరాం కు ఇండియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) వారు ప్రతిష్టాత్మక పర్ఫార్మెన్స్ ఎక్స్ లెన్స్ పురస్కారాన్ని ప్రకటించారు.

సింగరేణి సీఎండీ బలరామ్ కు ఐఐఐఈ పర్ఫార్మెన్స్ ఎక్స్​లెన్స్ ​పురస్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ సీఎండీ ఎన్.బలరాం కు ఇండియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) వారు ప్రతిష్టాత్మక పర్ఫార్మెన్స్ ఎక్స్ లెన్స్ పురస్కారాన్ని ప్రకటించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన 25 వ జాతీయ స్థాయి ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తరఫున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ , ఐఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. షిల్లాంగ్ లో ప్రదానం చేసిన ఈ అవార్డును సోమవారం సింగరేణి భవన్ లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్ డి ఎం సుభానీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ సంస్థ సీఎండీకి అందజేశారు. సింగరేణి సీఎండీగా ఎన్.బలరామ్ గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బహుముఖ విస్తరణ కోసం వినూత్న ప్రాజెక్టులు ప్రారంభించారని, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించడం, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒడిశాలో నైనీ ప్రాజెక్టు ప్రారంభానికి చూపిన చొరవ, సంప్రదాయేత ఇంధన వనరుల రంగంలోనూ సింగరేణిని ముందుకు తీసుకెళ్తుండటం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డును ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అదే విధంగా కంపెనీ విభాగంలోనూ మంచి టర్నోవర్ ను, లాభాలను సాధిస్తున్న సింగరేణి సంస్థకు కూడా కంపెనీల విభాగంలో పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డును అందించారు. సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సంస్థకు పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రతీ ఉద్యోగి శ్రమకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. సంస్థ ఉన్నతి కోసం ఉత్పాదకత పెంచేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయడం ద్వారా మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. 25 వ జాతీయ స్థాయి ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోల్​ ఇండియా , ఎన్ ఎం డీసీ, మజ్గావ్ డాక్ యార్డు, భెల్, బీపీసీఎల్, ఎంసీఎల్, హెచ్ ఏఎల్ తదితర సంస్థల నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story