ఒప్పంద కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

ఒప్పంద కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఈ పథకాన్ని మొట్టమొదటగా సింగరేణిలో ప్రారంభించడంలో సహకారం అందించిన బ్యాంకుల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సింగరేణి భవన్లో ఎస్బీఐ, యూబీఐ, బీఓబీ, పీఎన్బీ, ఐఓబీ, హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 34 మందికి దాదాపు రూ.30 కోట్ల బీమా సొమ్మును బ్యాంకుల ద్వారా అందించామన్నారు. ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిందన్నారు. అయితే ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షల ప్రమాద బీమా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఉద్యోగులు ఒక వేళ సహజ మరణిస్తే కనీసం రూ.20 లక్షల టర్మ్ ఇన్సురెన్స్ ఇచ్చే విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

సింగరేణి ప్రమాద బీమాను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

సింగరేణిలో అమలు చేస్తున్న ఈ బీమా పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఇప్పటికే కోలిండియాలోనూ అమలైందని సీఎండీ గుర్తుచేశారు. తమ సంస్థ ఒక మంచి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడంలో సహకారం అందిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్స్ తదితర ప్రాజెక్టులను చేపడుతున్న నేపథ్యంలో రుణ సదుపాయం కోరనున్నామన్నారు.

దీనివల్ల ఇరు సంస్థలకు వాణిజ్యపరమైన లబ్ధి చేకూరుతున్నందున ఉద్యోగుల కోసం అందించిన ప్రమాద బీమా సదుపాయాన్ని మరింత పెంచే ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. దీనిపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు. సింగరేణితో దీర్ఘకాల వాణిజ్య బంధాన్ని కొనసాగించేందుకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. సింగరేణి డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, ఏజీఎం(ఫైనాన్స్) చక్రవర్తి, వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు సురేశ్ కుమార్, సుమంత్ రెడ్డి, సుజీత్ ఝా, రేఖారావు, రమేశ్, విక్రమ్ సింగ్, రాజేశ్ సిన్హా, ఎడ్రిక్ అజయ్ డిసౌజా, శంకర్ కుమార్, రాజీవ్ కుమార్, వాణి, శ్రీమతి మాధురి, సైదులు, మణికందన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Next Story