- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఆదేశాలు బేఖాతర్..? రూ.7.50 లక్షలు ఎవరి జేబులోకి..?
సిద్దిపేట మున్సిపాలిటీలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిధుల దుర్వినియోగం వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. విడుదలైన నిధులకు,

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపాలిటీలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిధుల దుర్వినియోగం వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. విడుదలైన నిధులకు, మున్సిపల్ ఎజెండాలో మినిట్స్ బుక్స్ లో చూపుతున్న లెక్కలకు పొంతన లేదని కౌన్సిలర్లు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వజ్రోత్సవాల లావాదేవీలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి విచారణకు ఆదేశించినా..! అధికారులు లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని.. రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీకి 2022లో తెలంగాణ సమైక్యత వజ్ర ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రెవెన్యూ శాఖ ద్వారా రూ.30 లక్షలు (రూ.7.50 లక్షలు, రూ.15 లక్షలు చెక్ ల రూపేనా, రూ.7.50లక్షల నగదు రూపేనా) నిధులు విడుదలైనట్లు ఓ కౌన్సిలర్ ఆర్టీఏ దరఖాస్తుకు అధికారులు సమాధానం ఇచ్చారు.
కాగా, మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా టెబుల్ ఎజెండాలోని 8వ అంశంలో రూ.22.50 లక్షల నిధులు విడుదలైనట్లు పేర్కొని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశ పెట్టి, అదే అంశాన్ని మినిట్స్ బుక్ లో సైతం పేర్కొన్నట్లు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెల్లడించారు. మిగిలిన రూ.7.50 లక్షలు ఎజెండాలో చూపకుండా గోల్ మాల్ కు పాల్పడ్డట్లు ఆరోపిస్తూ జిల్లా ఇన్ చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వెంటనే స్పందించిన మంత్రి విచారణ చేయాలని జిల్లా ఉన్నతాధికారిని ఆదేశించారు. గతనెల చివరి వారంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సైతం ఇవే ఆరోపణలు మీడియా ముఖంగా చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే బల్దియాలో సమైక్యత వజ్రోత్సవాల నిధుల దుర్వినియోగం అంశంపై అధికారులు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురు రాజకీయ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. సిద్దిపేట మున్సిపాలిటీలో వజ్రోత్సవాల నిధుల గోల్ మాల్ జరిగిందని స్వపక్ష, విపక్ష పార్టీల నాయకుల ఆరోపణలతో బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నిధుల అంశంలో కొందరు కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తెలుస్తారా..? లేక ఎటూ తేల్చక మౌనంగా ఉండిపోతారో చూడాలి.






