ఉనికిని కోల్పోయే ప్రమాదంలో తెలుగు అకాడమీ?

by Gantepaka Srikanth |

మార్కెట్‌లో ఎన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మాత్రం ముందుగా గుర్తుకొచ్చేవి తెలుగు అకాడమీ పుస్తకాలే.

ఉనికిని కోల్పోయే ప్రమాదంలో తెలుగు అకాడమీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెట్‌లో ఎన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మాత్రం ముందుగా గుర్తుకొచ్చేవి తెలుగు అకాడమీ పుస్తకాలే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైతం పోటీపరీక్షల్లో అకాడమీ పుస్తకాల్లోని సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో తెలుగు అకాడమీ ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందిస్తున్నది. కానీ 2025-26 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఇప్పటివరకు అందలేదు. కొన్ని కాలేజీల్లో గతేడాది మెటీరియల్ నే జిరాక్స్ కాపీలను తీసుకుని విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి నెలకొంది.

సిలబస్ మార్పు సాకుతో జాప్యం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికం. అయితే, ఈ ఏడాది సిలబస్ మార్పులు జరగడమే పుస్తకాల ముద్రణలో జాప్యానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కొత్త సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, అనువాద ప్రక్రియలో ఆలస్యం కావడం వంటి కారణాలతో ముద్రణ వేగవంతం కాలేదని చెబుతున్నారు. ఈ ఏడాది సిలబస్ లో మార్పు కారణంగా విద్యార్థులకు పుస్తకాల అందడంలో జాప్యం జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకులు పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థులు గత్యంతరం లేక ప్రైవేట్ పబ్లికేషన్లు ముద్రించే గైడ్లు, మెటీరియల్‌పైనే ఆధారపడుతున్నారు. ఇదిలాఉండగా, కొన్నేళ్లుగా ఇంటర్ పాఠ్యపుస్తకాలను ముద్రించి సకాలంలో మార్కెట్లోకి తీసుకురావడంతో తెలుగు అకాడమీ నిర్లక్ష్యం వీడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ముందస్తుగా ప్రకటించినప్పటికీ అకాడమీ అధికారులు అప్రమత్తం కావడంలో నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రతి ఏటా కాలేజీలు ప్రారంభమైనా పుస్తకాలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అకాడమీపై పర్యవేక్షణ ఏది?

అకాడమీకి శాశ్వత డైరెక్టర్ లేకపోవడం, ఇన్ చార్జి డైరెక్టర్ అకాడమీ వైపే వెళ్లకపోవడం, అందులోనూ కింది స్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వంటి కారణాలతో తెలుగు అకాడమీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ పనితీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అకాడమీపై డైరెక్టర్ పర్యవేక్షణ కొరవడడమే ఈ దుస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు. అకాడమీ పుస్తకాలు రాకపోవడంతో ప్రైవేట్ పబ్లిషర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విద్యార్థుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ పుస్తకాల్లో సమాచారం ఎంతవరకు ప్రామాణికంగా ఉంటుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అకాడమీ పుస్తకాలే కీలకంగా భావిస్తారు.

Next Story