- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంఆర్ బియ్యం అప్పగింతలో జాప్యం.. నిల్వ, తూకంలో రేషన్ డీలర్లకు సవాళ్లు
వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. కొన్ని రోజుల నుంచి మండల లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాలకు బియ్యాన్ని తరలిస్తున్నది. అంగన్ వాడీలు, హాస్టళ్లతో పాటు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అంటే 3 నెలలకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2 నెలలకు సరిపడా స్టాక్ ఉందని, మిగతా ఒక నెలకు సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.
పూర్తిస్థాయిలో చేరని ‘సీఎంఆర్’..
వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం కొనుగోలు చేసింది. వాటిని సీఎంఆర్ చేస్తే 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేసి ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. కానీ, రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సన్నబియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని, మిగతా యాసంగి రైస్‌తో కలిపి ఇచ్చేందుకు 10 జిల్లాల్లో ఒప్పందం జరిగినట్లు అధికారులు అంతర్గత సంభాషణలో తెలిపారు. అయితే, సీఎంఆర్‌కు ఇచ్చిన బియ్యాన్ని మిల్లర్లు ఏనాడూ పూర్తిగా అప్పగించలేదని, ఈ నేపథ్యంలో 3 నెలల బియ్యం పంపిణీలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవచ్చని రేషన్ డీలర్ల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. మరో వైపు మే నెలకు సంబంధించి సన్నబియ్యం కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ కాలేదని అంటున్నారు. స్టాక్ కొరత కారణంగా 15శాతం మంది లబ్ధిదారులు బియ్యం లేక వెనుదిరిగారని, వారికి ఏవిధంగా సర్దుబాటులో చేయాల్లో తెలియడం లేదని చెబుతున్నారు.
నిల్వ చేయడానికీ ఇబ్బందులే..
3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తే నిల్వ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని రేషన్ డీలర్లు అంటున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో 90 శాతానికి పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్తున్నారని, వీటిని పంపిణీ చేయడానికే 2 సార్లు లోడ్ తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు 3 నెలలకు సంబంధించి బియ్యం నిల్వ చేయడానికి మరో చోట ఇండ్లు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఒక రూమ్ అద్దె, ఇతర ఖర్చులకే సరిపోవడం లేదని, ఇప్పుడు బియ్యం నిల్వ కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆర్థిక భారం మీద పడుతుందని వాపోతున్నారు. తూకం వేయడానికీ సహాయకుల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుందని, దీంతో తాము నష్టపోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
సాఫ్ట్‌వేర్, తూకంలోనూ సమస్యలే..
3 నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేయడానికి సాఫ్ట్ వేర్, తూకంలోనూ సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ పాస్ మిషన్ల ద్వారా వేలిముద్రలు తీసుకొని లబ్ధిదారుడికి బియ్యాన్ని ఇస్తున్నారు. అయితే, 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తూకం చేసి ఇవ్వాలంటే సాధ్యం కాదని డీలర్ల సంఘం నేతలు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఐరిస్, వేలిముద్రలు ఇస్తే వెంటనే ఆ కార్డ్‌కు సంబంధించి వేలిముద్రలు మిషన్లు తీసుకోవు. మరో నలుగురు లబ్ధిదారులకు ఇచ్చిన తరువాతే మిషన్ అంగీకరిస్తుంది. దీంతో 3 నెలల బియ్యం ఒక లబ్దిదారునికి మూడు సార్లు ఇవ్వడం సాధ్యం కాదు. దీంతో సాఫ్ట్ వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూ టూత్ మిషన్ విషయంలో సడలింపు ఇవ్వాలని, ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు. అంతేకాకుండా, 15వ తేదీ తరువాత బియ్యం పంపిణీ చేస్తే మిషన్లు పని చేయవని, మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీకి జూన్ 30 వరకు అవకాశమివ్వాలని డీలర్లు కోరుతున్నారు. అంతేకాకుండా నెట్ వర్క్ సమస్య లేకుండా 4జీ సిమ్స్ జారీ చేయాలని కోరుతున్నారు. కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటే 108 కిలోలు వేయింగ్ మిషన్లు తూకం వేయగలవా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త లబ్ధిదారులకు పంపిణీపై సందిగ్ధం..
రాష్ట్రంలో 91.19 లక్షల కార్డుల ద్వారా ప్రభుత్వం 2.93 కోట్ల మందికి 1.97లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇటీవల 1.5 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు మొత్తంగా 13 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను కార్డుల్లో జత చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీరికి వచ్చే నెలలో 3 నెలలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ చేస్తారా? అనే సందిగ్ధం నెలకొన్నది. జూన్ వరకు కొత్త లబ్ధిదారుల విషయంలో జాప్యం చేసి.. ఆ తర్వాత వీరికి రేషన్ పంపిణీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతున్నది.






