ప్రీ ప్రైమరీకి టీచర్ల కొరత.. రాష్ట్రంలో చిన్నారుల చదువుకు అడ్డంకి!

by Ramesh Naini |

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ సవాల్‌గా మారింది. చిన్నారులకు ప్రాథమిక విద్య అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ తరగతులు, సరైన సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ప్రీ ప్రైమరీకి టీచర్ల కొరత.. రాష్ట్రంలో చిన్నారుల చదువుకు అడ్డంకి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ సవాల్‌గా మారింది. చిన్నారులకు ప్రాథమిక విద్య అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ తరగతులు, సరైన సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ప్రారంభించిన వాటితో కలిపి ఇప్పటి వరకు సుమారు 4వేల వరకు ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించింది. కానీ ఇప్పటికీ అనేకచోట్ల ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యేకంగా టీచర్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీంతో చాలాచోట్ల స్థానిక ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే ఈ చిన్నారులకు కూడా అదనంగా పాఠాలు బోధించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల అంగన్ వాడీ సెంటర్లు పాఠశాలల్లో ఉన్నచోట్ల అంగన్వాడీ టీచర్లే పిల్లలకు పాఠాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యుటేషన్లు, తదితర కారణాలతో పిల్లల సంఖ్యకు తగినట్లు ప్రాథమిక స్కూల్ టీచర్లు లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రీప్రైమరీ పిల్లల బాధ్యత కూడా వారిపైనే పడుతోంది.

కొత్తగా 2769 ప్రీప్రైమరీ తరగతులు

రాష్ట్రవ్యాప్తంగా 2769 ప్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. వీటిలో ఒక ఇన్ స్ట్రక్టర్, ఒక ఆయా చొప్పున 5,538 మందిని నియమించాలి.. ఎంపిక ప్రక్రియను కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్ల రీ ఓపెనింగ్ కు ముందే జూన్ 15కు ముందే నియామకాలు చేపట్టాలని సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. ఎంపిక తుదిగడువు లేకపోవడంతో నియామకాలు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రీ ప్రైమరీ తరగతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వీలైనంత తొందరగా ఈ నియామకాలను పూర్తి చేసి ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

Next Story