రాష్ట్రానికి ఐపీఎస్‌ల కొరత.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 02:19:48  IST  )

తెలంగాణను ఐపీఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వం కేడర్ రివ్యూ కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి.

రాష్ట్రానికి ఐపీఎస్‌ల కొరత.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను ఐపీఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వం కేడర్ రివ్యూ కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 2025 మే నెలలో 139గా ఉన్న ఐపీఎస్ పోస్టుల సంఖ్యను ప్రస్తుతం 151కు పెంచారు. అయినప్పటికీ రాష్ట్రంలో 133 మంది అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. పెరిగిన జిల్లాల ఆధారంగా ఈ సంఖ్యను 194కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర హోంశాఖను కోరింది. పెరిగిన పరిపాలనా అవసరాల దృష్ట్యా కొత్తగా 8 జిల్లాలకు (జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్) ఎస్పీ పోస్టులతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన కమిషనరేట్‌కు అదనపు పోస్టులను మంజూరు చేశారు. ఈ నేపధ్యంలో ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడింది. మరోవైపు 2025లో ఆరుగురు సీనియర్ అధికారులు పదవీ విరమణ చేశారు. 2024లో రిటైర్మెంట్ పొందిన అధికారల్లో ప్రస్తుతం ఇద్దరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. 2025లో పదవీ వివరణ పొందిన మరో ఇద్దరు అధికారులూ వివిధ హోదాల్లో కొనసాగిస్తున్నారు.ఇక ఈ ఏడాది మరో ఇద్దరు అధికారులు పదవీ విరమణ పొందనున్నారు. ఇక ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వం ఐపీఎస్ హోదా కల్పించింది. వారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 133 దాటడం లేదు.

151 పోస్టుల పూర్తి కేడర్ విభజన వివరాలు..

మొత్తం సర్వీస్ డ్యూటీ పోస్టులు - 83

కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులు-33

రాష్ట్ర డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులు-20

శిక్షణ రిజర్వ్ పోస్టులు - 2

లీవ్ రిజర్వ్, జూనియర్ రిజర్వ్ పోస్టులు-13

కేడర్ వైస్ డిస్ట్రిబ్యూషన్‌లో 2 శాతమే..

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించే ప్రక్రియ కేవలం 2 శాతానికి పరిమితమైంది. 73, 74బ్యాచ్‌లలో కేంద్రం 3 శాతం కేటాయించగా, 75 బ్యాచ్‌లో 6 శాతం కేటాయించారు. 76, 77 బ్యాచ్‌లలో కేవలం 2 శాతం మాత్రమే కేటాయించారు. ఇక 77 బ్యాచ్‌లో నలుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి ఇచ్చారు.

గతేడాది ఆరుగురు.. ఈ ఏడాది మరో ఇద్దరు..

2025లో ఆరుగురు అధికారులు పదవీ విరమణ చేయగా 2026లో మరో ఇద్దరు సీనియర్ అధికారులు రిటైర్డ్ కానున్నారు. 2025లో కీలక బాధ్యతల్లో ఉన్న వారు పదవీ విరమణ పొందారు. తెలంగాణ డీజీపీగా సేవలందించిన జితేందర్ కూడా 2025 సెప్టెంబర్ 30న రిటైర్డ్ అయ్యారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ‌గా పనిచేసిన రవి గుప్తా పదవీ విరమణ పొంది.. ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో విజిలెన్స్ డీజీగా పని చేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా చేసిన కమల్‌హాసన్ రెడ్డి, మల్టీజోన్-2 ఐడీ వి సత్యనారాయణ, మరో సీనియర్ అధికారి విశ్వ ప్రసాద్ కూడా పదవీ విరమణ పొందారు. వీరి రిటైర్మెంట్‌తో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి పదవీ కాలం కూడా 2026 ఏప్రిల్ నెలతో ముగియనుంది. రాచకొండ కమిషనరెట్ సీపీగా చేసి నాల్గవ కమిషనరెట్‌గా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ సీపీగా నియమితులైన సుధీర్ బాబు ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కేడర్ రివ్యూను ఆమోదిస్తే కొత్తగా పోస్టులు మంజూరై, పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాల ద్వారా ఖాళీలను భర్తీ చేసే వీలుంటుంది.

ఒక్కొక్కరికీ రెండు, మూడు అదనపు బాధ్యతలు

కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం అందించిన డేటాప్రకారం.. తెలంగాణలో ఒక డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 8 ప్రమోషన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఐపీఎస్‌ల కొరత కారణంగా అనేక కీలక విభాగాలైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ విభాగంతో పాటు విజిలెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ పర్యవేక్షిస్తున్నారు. మహిళా భద్రతా విభాగం, సీఐడీ విభాగాలకు డీజీ స్థాయి అధికారులు నేతృత్వం వహించాల్సి ఉండగా ఏడీజీపీగా ఉన్న మరో సీనియర్ అధికారి చారు సిన్హా పర్యవేక్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్రమోషన్ కోటా పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం వంటి కారణాలు ఉన్నాయి. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రతిపాదనలు సకాలంలో సమర్పించకపోవడం, అర్హులైన రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలుగా తెలుస్తుంది.

Next Story