- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సిలిండర్ల కొరత! హైదరాబాద్ హోటళ్లలో కరెంటు, కట్టెల పొయ్యిలే దిక్కు..!
తెలంగాణలో కమర్శియల్ అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్లు, హోటళ్లు వంట వండటానికి గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్‌లు, పలు చోట్ల కట్టెల పొయ్యికి మారుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడమే కాకుండా, బ్లాక్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో సామాన్య హోటల్ వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కరెంట్ పొయ్యిలే దిక్కు..
నగరంలోని పలు టిఫిన్ సెంటర్లలో ఇప్పుడు కరెంట్ పొయ్యిలే కనిపిస్తున్నాయి. ‘గతంలో మేము వాణిజ్య సిలిండర్‌ను రూ. 1,800 నుంచి 1,900 మధ్య కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రూ. 3,000 నుంచి 4,000 పెట్టినా సిలిండర్ దొరకడం లేదు. దీంతో చేసేదేమీ లేక విద్యుత్ స్టౌవ్‌లు కొన్నాము. ఇప్పుడు మార్కెట్‌లో కరెంటు పొయ్యిలకు కూడా కొరత ఏర్పడింది’ అని రాజ్‌కుమార్ అనే హోటల్ కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాస్ సంక్షోభం కేవలం చిన్న హోటళ్లకే పరిమితం కాలేదు. హైటెక్ సిటీ, సైబరాబాద్‌లోని ఫై స్టార్ హోటళ్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరఫరా లేకపోవడంతో నిల్వలు కేవలం ఒకటి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ ఆదా చేసేందుకు కొన్ని హోటళ్లు తమ మెనూలో మార్పులు చేశాయి. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే గ్రిల్డ్ చికెన్, మటన్ వంటకాలు, కబాబ్‌లను తాత్కాలికంగా తొలగించాయి. మరికొన్ని హోటళ్లు కేవలం తమ వద్ద బస చేసే అతిథులకు (In-house guests) మాత్రమే భోజన సౌకర్యం కల్పిస్తున్నాయి.
కట్టెల పొయ్యిపై బిర్యానీ
లక్డీకాపూల్‌లోని ప్రసిద్ధ షాహౌస్ హోటల్‌లో గ్యాస్ లేక బుధవారం మధ్యాహ్నం బిర్యానీని కట్టెల పొయ్యిపై వండాల్సి వచ్చింది. ప్రముఖ ఫుడ్ కోర్ట్ 'పారడైజ్' కూడా గ్యాస్ కొరత ఉన్న చోట విద్యుత్ వంట వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గత మూడు రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో కొరత కారణంగా హోటల్ నిర్వాహకులు డొమెస్టిక్ (గృహ) సిలిండర్లను రూ. 500 అదనంగా చెల్లించి అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలోనూ అదే పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల వంటి కోస్తా ప్రాంతాల్లోని రిసార్టులు, హోటళ్లు కూడా సిలిండర్ల కొరతతో సతమతమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరగడంతో, కమర్శియల్ సిలిండర్ ధర ఇటీవల రూ. 144 పెరిగి, ప్రస్తుతం రూ. 2,042.50కి చేరింది.
గ్యాస్ ఏజెన్సీలు ఏమంటున్నాయి?
వాణిజ్య గ్యాస్ లభ్యత తగ్గడం వల్లే సరఫరాను నియంత్రించామని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటళ్ల కంటే ఆసుపత్రులు, హాస్టళ్లు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వరంగల్ హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ రామకృష్ణ రాజు తెలిపారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేశారు.






