- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఏరి?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, వాటిని బోధించేందుకు సరిపడా అధ్యాపకులు అందుబాటులో లేరు. రాష్ట్రంలో 59 ప్రభుత్వ, 52 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, వాటిని బోధించేందుకు సరిపడా అధ్యాపకులు అందుబాటులో లేరు. రాష్ట్రంలో 59 ప్రభుత్వ, 52 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. ఇందులో మొత్తం 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఈ ఏడాది కొత్తగా 4,200 సీట్లను పెంచారు. సీట్ల భర్తీని పరిశీలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువ సీట్లు నిండాయి. ప్రభుత్వ కాలేజీల్లో 14,322 సీట్లుంటే 11,267 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లో 14,640 సీట్లకు గాను 8,464 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పరిస్థితులు ఇలా ఉంటే కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పాలిటెక్నిక్ మొదటి విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త సాంకేతిక కోర్సులను ప్రవేశపెడుతున్న అధికారులు, ఫ్యాకల్టీ కొరతను అధిగమించడంపై దృష్టి పెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కీలక విభాగాల్లో తీవ్ర కొరత
ప్రస్తుతం పాలిటెక్నిక్‌లలో అత్యధిక డిమాండ్ ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) విభాగాల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ జరగకపోవడంతో, ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. ఇది విద్యార్థుల బోధనపై, వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. గత మూడేళ్ల కింద సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఒక పాలిటెక్నిక్ కాలేజీలో సీటు పొందిన మెరిట్ విద్యార్థి ఫ్యాకల్టీ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐఎంల్ కోర్సులో జాయిన్ విద్యార్థి ఆ కోర్సును బోధించే లెక్చరర్ లేక సొంతంగా ఇంటర్నెట్ ద్వారా పాఠాలు నేర్చుకుని చదువుకున్నాడని చెబుతుండడం గమనార్హం.
ఆర్థికశాఖ అనుమతి కోసం ఎదురుచూపులు
విద్యార్థులకు బోధన కుంటుపడకుండా ఉండేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి(ఎస్బీటెట్) తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా సుమారు 200 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు వీలుగా ఆర్థికశాఖ అనుమతి కోరుతూ నెలరోజుల కిందట ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు జరిగే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం చేపట్టాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.






