- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దడ పుట్టిస్తున్న ఏసీబీ రెయిడ్స్.. ఆరు నెలల్లోనే 126 కేసులు నమోదు
రాష్ట్రంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్నది. లంచగొండి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నది. ముమ్మరంగా దాడులు చేస్తూ కోట్లాది రూపాయలను జప్తు చేయడమే కాకుండా.. లంచావతారులను కటకటాల వెనక్కి పంపుతున్నది. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఏసీబీ దాడుల డేటా చూస్తే ఇది స్పష్టమవుతున్నది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఏసీబీ దాడులను ముమ్మరం చేసింది. ఆరు నెలల్లోనే 126 కేసులు నమోదు చేసి 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ఇందులో పోలీసు శాఖకు చెందిన వారే 15 మంది ఉన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఇందులో ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద రూ. వందల కోట్లు ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
ఆరు నెలల్లో 125 మంది అరెస్ట్
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 126 కేసులను నమోదు చేసిన ఏసీబీ.. 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించింది. వాటిలో 80 ట్రాప్ కేసులు, 8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 14 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 10 సాధారణ తనిఖీలు, 11 ఆకస్మిక తనిఖీలు, మూడు ఇంటెలిజెన్స్ తనిఖీలు ఉన్నాయి. ట్రాప్ కేసుల్లో రూ.24.57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో రూ.27.66 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఆరు నెలల్లో గతంలోని కేసులను కూడా కలుపుకొని 129 కేసులను ఫైనల్ చేసి, ప్రభుత్వానికి తుది నివేదికలను ఏసీబీ అధికారులు పంపించారు.
ఒక్క జూన్‌లోనే 31 కేసులు
ఒక్క జూన్ నెలలోనే ఏసీబీ 31 కేసులు నమోదు చేసింది. ఇందులో 15 ట్రాప్ కేసులు కాగా, 2 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 3 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 4 రెగ్యులర్ ఎంక్వయిరీలు, 7 ఆకస్మిక తనిఖీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో ఏసీబీ మొత్తం రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నది. రెండు ఆక్రమ ఆదాయ ఆస్తుల కేసుల్లో రూ.5.36 కోట్లు విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.2,72,030 మొత్తాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నది. జూన్ నెలలో 11 కేసులకు సంబంధించి ఫైనల్ ఎంక్వయిరీ పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదికలను అందజేసింది. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ కు సంబంధించి ఏసీబీ 13 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. రూ.5.22 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.






