EAPCET : ఎప్‌సెట్‌కు షాక్.. గతేడాది కంటే ఈసారి తక్కువ అప్లికేషన్లు

by Ramesh Naini |

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్-2026 దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఈ నెల 4 న ముగిసింది.

EAPCET : ఎప్‌సెట్‌కు షాక్.. గతేడాది కంటే ఈసారి తక్కువ అప్లికేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (EAPCET) టీజీ ఎప్‌సెట్-2026 దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఈ నెల 4 న ముగిసింది. దీంతో గత ఏడాది ఇంజనీరింగ్ విభాగానికి 2.20 లక్షలు, అగ్రికల్చర్ కు దాదాపు 87 వేలు కాగా, మొత్తం 3.07 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోసం 2,03,167 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 86,523 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ కోసం రెండూ కలిపి 284 మంది దరఖాస్తులు సమర్పించారు.

తగ్గిన దరఖాస్తుల సంఖ్య

గతేడాదితో పోలిస్తే ఈసారి ఎప్‌సెట్‌కు దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా తగ్గడం గమనార్హం. గత సంవత్సరం మొత్తం 3.07 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకు రెండు విభాగాల్లో ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ,ఫార్మసీ కలిపి మొత్తం 2,89,974 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంటే గతేడాది కంటే ఇప్పటివరకు సుమారు 17 వేల దరఖాస్తులు తక్కువగా నమోదయ్యాయి. మే 2 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కానీ కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 6 వేల మంది వరకే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు, డీమ్డ్ యూనివర్శిటీలు పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ యూనివర్శిటీలు ఇప్పటి నుండే విద్యార్థులను సంప్రదించడం, వాటిల్లో పెద్ద మొత్తంలో సీట్లు ఉండడంతో కొందరు ఎప్ సెట్ కు దరఖాస్తు చేయడం లేదని అధికారులు భావిస్తున్నారు.

ఆలస్య రుసుముతో ఇంకా అవకాశం

సాధారణ గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగాలకు ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి.

Next Story