కార్పొరేట్ స్కూళ్లకు దిమ్మతిరిగే షాక్: సర్కారు బడికి ‘స్టార్’ క్రేజ్.. అడ్మిషన్ల కోసం భారీ క్యూ

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-06 15:13:56  IST  )

సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా టికెట్ల కోసమో లేదా కార్పొరేట్ స్కూల్ సీట్ల కోసమో జనం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టడం చూస్తుంటాం.

కార్పొరేట్ స్కూళ్లకు దిమ్మతిరిగే షాక్: సర్కారు బడికి ‘స్టార్’ క్రేజ్.. అడ్మిషన్ల కోసం భారీ క్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా టికెట్ల కోసమో లేదా కార్పొరేట్ స్కూల్ సీట్ల కోసమో జనం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టడం చూస్తుంటాం. కానీ, నల్గొండ జిల్లా కేంద్రంలో సీన్ రివర్స్ అయ్యింది. నల్గొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు తెల్లవారుజామునే గేట్ల ముందు బారులు తీరారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను శిఖరాగ్రానికి చేర్చిన ఈ పాఠశాల, ఇప్పుడు ఒక ‘మోడల్ స్కూల్’గా దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నిధులతో, తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ పాఠశాలను కార్పొరేట్ స్థాయిని మించిన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. కేవలం భవనమే కాకుండా, ఇక్కడి బోధనా పద్ధతులు కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అరుదుగా కనిపించే స్మార్ట్ క్లాసులు, ఏఐ (AI) ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ ఇక్కడ విద్యార్థులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.

నాణ్యమైన భోజనం..

పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం వల్ల తల్లిదండ్రుల్లో పాఠశాల పట్ల విశ్వాసం పెరిగింది. విశాలమైన క్రీడా మైదానంలో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. "ఇది కేవలం ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయికి దీటైన విశ్వవిద్యాలయం" అంటూ అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండటంతో నల్గొండ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న చిన్నచూపును పటాపంచలు చేస్తూ, బొట్టుగూడ స్కూల్ ఒక విద్యా విప్లవానికి నాంది పలికింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజన్‌కు ఈ పాఠశాలే నిదర్శనమని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచడంలో ఈ మోడల్ స్కూల్ ఒక మైలురాయిగా నిలిచింది. వీడియో

Next Story