గ్రామీణ మహిళలకు అండగా ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు

by Ajay Maddhiboyina |

గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.

గ్రామీణ మహిళలకు అండగా ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి ఇది చారిత్రాత్మక ముందడుగు అని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి డా.ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క పేర్కొన్నారు. మంత్రి సీత‌క్క ఆదేశాల మేర‌కు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో గ్రామ సంస్థలు (వీవోలు), ఎస్ హెచ్ జీ ఫెడరేషన్ల కోసం శాశ్వ‌త భవనాల నిర్మాణం చేప‌ట్టాల‌ని మ‌హిళా స్వ‌యం స‌హ‌య‌క సంఘ స‌భ్యులు ప్ర‌భుత్వానికి ఎంతో కాలంగా విజ్ఞ‌ప్తి చేస్తున్న నేప‌థ్యంలో నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో భవనానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. 200 గ‌జాల్లో, క‌నీసం 552 చ‌ద‌ర‌పు అడుగుల్లో భ‌వ‌నం ఉండేలా డిజైన్ సిద్దం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ..గ్రామీణ మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా, స్వయం ఉపాధి, నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలి. అందుకే ప్రతి గ్రామంలో ఎస్ హెచ్ జీ ఫెడరేషన్ భవనం ఉండాలి. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ద‌శ‌ల వారిగా అన్ని గ్రామాల్లో ఎస్ హెచ్ జీ ఫెడరేషన్ భవనాలు నిర్మించ‌నున్నారు.

గ్రామ సభ తీర్మానం ఆధారంగా:

అయితే గ్రామ సభ తీర్మానం ఆధారంగా ప్రతిపాదనలు మండల, జిల్లా స్థాయిల ద్వారా జిల్లా కలెక్టర్ అనుమతితో పనులు చేపట్టనున్నారు. నిర్మాణ పనులను పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూర్తిచేస్తారు. ఉపాధీ హ‌మీ నిధుల‌తో చేప‌ట్లే ఈ పనులకు సామాజిక తనిఖీ తప్పనిసరిగా నిర్వహించనున్నారు. భ‌వ‌న నిర్మాణ పనులు పూర్తైన ఆరు నెలలలోపు సోషల్ ఆడిట్ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లు, పీఆర్ ఆర్ డీ అధికారులు కచ్చితంగా అమలు చేసి, మహిళా సంఘాల బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Next Story