సీపీఐ (ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా షేక్ షావలి

by Ramesh Naini |

రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా షేక్ షావలి ఎన్నికైనట్లు పార్టీ అధికార ప్రతినిధి బి. ప్రకాష్ వెల్లడించారు.

సీపీఐ (ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా షేక్ షావలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా షేక్ షావలి ఎన్నికైనట్లు పార్టీ అధికార ప్రతినిధి బి. ప్రకాష్ వెల్లడించారు. హైదరాబాద్ జవహర్ నగర్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ కేంద్ర స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ ఐక్యతను పరిరక్షించడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం లక్ష్యంగా షేక్ షావలిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న మల్లెపల్లి ప్రభాకర్ గత మూడు సంవత్సరాలుగా అనుసరించిన వ్యక్తిగత పని విధానంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మల్లేపల్లి గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేని వ్యక్తుల కోసం ప్రచారం నిర్వహించినట్లు ఆరోపించారు.

పార్టీతో చర్చించకుండా ఏకపక్షం..

పార్టీతో చర్చించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రజా సంఘాలను రద్దు చేస్తున్నట్లు ఏకపక్ష ప్రకటనలు జారీ చేయడం కూడా తీవ్ర ఆక్షేపణీయం అని అన్నారు. ఈ వ్యవహారాలపై జనవరి 28, 29 తేదీల్లో సూర్యపేటలో రెండు రోజుల పాటు కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తూ, పార్టీ ఐక్య నిర్మాణం నుంచి తొలగించినట్టు తెలిపారు. నూతన కార్యదర్శిగా ఎన్నికైన షేక్ షావలి మాట్లాడుతూ, గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాతగా పేరుగాంచిన సిపి రెడ్డి అడుగుజాడల్లో పార్టీని ముందుకు నడిపిస్తానని తెలిపారు. ప్రజలు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాలకు పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు, వర్గపోరాటాల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని, ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కృషి చేస్తామని షావలి పేర్కొన్నారు.

Next Story