చివరి నిమిషంలో ట్విస్ట్.. గవర్నర్‌ను కలవకుండానే వెళ్లిపోయిన షర్మిల!

by Disha Web Desk 19 |
చివరి నిమిషంలో ట్విస్ట్.. గవర్నర్‌ను కలవకుండానే వెళ్లిపోయిన షర్మిల!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రాజ్ భవన్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో అనూహ్యంగా గవర్నర్‌తో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు భేటీ కాబోతోందన్న చర్చ పొలిటికల్ హీట్ పెంచింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి ముందు కేసీఆర్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు గురువారం షర్మిల గవర్నర్ అపాయింట్ మెంట్ కోరింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12.50 కి గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా లభించినట్టు తెలిసింది. అయితే అనూహ్యంగా గవర్నర్‌తో షర్మిల భేటీ కాకుండానే పాదయాత్రకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది.

గురువారం ఉదయం లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల.. గవర్నర్‌తో భేటీ కాకుండానే నేరుగా పాదయాత్రకు వెళ్లిపోయారు. గతంలో పాదయాత్ర ఆగిపోయిన నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. అయితే గత కొంత కాలంగా షర్మిల పార్టీ బీజేపీకి బీ టీమ్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్‌తో అపాయింట్మెంట్ లభించినా భేటీ రద్దు కావడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ భేటీ రద్దు అయిందని వైఎస్సార్టీపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed