- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనార్టీ శాఖలో ‘షాడో’ హవా.. మంత్రి లేకుండానే రివ్యూలు!
మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను కాదని, సంబంధిత శాఖలో ఓ నామినేటెడ్ నేత 'షాడో మినిస్టర్'గా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ ఉన్నా.. ఆ శాఖలో మాత్రం ఆయన కన్నా ఓ షాడో మినిస్టర్ పెత్తనమే ఎక్కువగా నడుస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది. శాఖలో ఏ పని జరగాలన్నా.. ముందుగా ఆయన అనుమతి తప్పనిసరి అనే టాక్ వినిపిస్తున్నది. ఏ అధికారి అయినా ధైర్యం చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే.. సదరు షాడో మినిస్టర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమకు ఎందుకు వచ్చిన తలనొప్పి అనే రీతిలో.. అధికారులందరూ షాడో మినిస్టర్ వద్దకు వెళ్లి, ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
పేరుకు మాత్రమే నామినేటెడ్ పదవి
మైనార్టీ శాఖ పరిధిలోని ఓ సంస్థకు నామినేటెడ్ పదవి హోదాలో ఉన్న ఆ నాయకుడు.. శాఖ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తుండడంతో ఆ లీడరుకు ‘షాడో మినిస్టర్’ అనే పేరు పెట్టారు. జిల్లా స్థాయి నుంచి మొదలుకొని సెక్రెటేరియట్ వరకు ఏ చిన్న పని కావాలన్నా.. సదరు నాయకుడి అనుమతి ఉండాల్సిందేననే ప్రచారం ఉంది. ఒకవేళ ఎవరైనా అధికారులు, లీడర్లు ఆయనకు తెలియకుండా ముందుకు వెళ్తే.. ఎక్కడో ఒక దగ్గర ఆ పనికాకుండా అడ్డుపడుతారని టాక్ నడుస్తున్నది. దీంతో ఆ శాఖలో కీలక హోదాలో ఉన్న అధికారులు, కొందరు లీడర్లు సైతం ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. కొందరైతే ఉదయాన్నే ఆయన్ను కలుసుకునేందుకు సదరు లీడరు ఇంటికి వెళ్లి వస్తుంటారని ప్రచారం జరుగుతున్నది. ఆయన చెప్పినట్టు వినకపోతే బదిలీ చేయిస్తారనే భయంతో కొందరు, ఎందుకొచ్చిన తలనొప్పి అనే తీరుగా మరికొందరు అధికారులు షాడో మినిస్టర్‌కు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారని టాక్. ప్రస్తుతం అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం అందరికీ పోస్టింగులు ఇస్తారు. కానీ మైనార్టీ శాఖలో మాత్రం అందుకు విరుద్ధంగా షాడో మినిస్టర్ సూచించిన వ్యక్తులకు కీలకమైన చోట్ల పోస్టింగ్ ఇవ్వాలనే ఒత్తిడి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.
మంత్రి లేకుండానే సమీక్షలు
ఇటీవల ఉత్తర తెలంగాణలోని ఓ ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ శాఖ పరిధిలోని పలు అంశాలపై సెక్రెటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా అధికారులతో రివ్యూ జరిగింది. ఆ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రితో పాటు, షాడో మినిస్టర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. కానీ ఆ శాఖ మంత్రి అజారుద్దీన్ మాత్రం అటెండ్ కాలేదు. దీంతో అసలు మంత్రి నోటీసులో ఉండి రివ్యూ జరిగిందా? ఆయన తెలియకుండానే షాడో మినిస్టర్ గైడెన్స్ మేరకు సమీక్ష జరిగిందా? అనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది. సదరు నేత కేవలం మైనార్టీ శాఖలో మాత్రమే కాకుండా, కీలకమైన మున్సిపల్, హోంశాఖలో సైతం చక్రం తిప్పుతుంటారనే ప్రచారం ఉన్నది. పై స్థాయిలో ఆశీస్సులు ఉండటంవల్లే ఆయనను అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.






