భార్య, పిల్లల్ని అందుకే చంపాడు.. రాజ్‌కుమార్ సోదరి స్టేట్మెంట్!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-13 06:43:46  IST  )

షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ విషయంలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

భార్య, పిల్లల్ని అందుకే చంపాడు.. రాజ్‌కుమార్ సోదరి స్టేట్మెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ విషయంలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అతని భార్య, పిల్లల్ని చంపడం వెనుక ఉన్న కారణాలు తెలియవచ్చాయి. అతని సోదరి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ భార్య సరిత (33) తనకంటే వయసులో ఆరేళ్లు పెద్దది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. అయితే.. రాజ్ కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకు ట్యూషన్ చెప్పిన టీచరే ఈ సరిత అని పోలీసుల తాజా విచారణలో తెలిసిందని సమాచారం. ఆమెను ప్రేమ పేరుతో వేధించిన రాజ్ కుమార్.. ఆమెకు ఇంట్లో చూసిన పెళ్లి సంబంధాలను చెడగొట్టి మరీ.. 2018లో పెళ్లి చేసుకున్నాడు.

డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అతను.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు తీవ్రంగా అలవాటుపడి.. పెద్దమొత్తంలో అప్పు చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పులు కట్టలేకపోతున్నానని, తాను చనిపోతానని రాజ్ కుమార్ తల్లిదండ్రులకు మొరపెట్టుకోగా.. తమకు ఉన్న కొంత పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాతైనా అతనిలో మార్పు రాకపోగా.. మరింత జల్సాలకు, మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడని, దాదాపు రూ.2 కోట్లు అప్పులు చేశాడని రాజ్ కుమార్ సోదరి పోలీసులకు తెలిపింది. అతని వేధింపులు భరించలేక తనకు విడాకులు ఇవ్వాలని అడిగిందని, అందుకే ఆమెపై పగ పెంచుకుని ఇద్దరు పిల్లలతో సహా చంపేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

3 ఫోన్లు.. 12 సిమ్ కార్డులు

కాగా.. మూడురోజుల నుంచి రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. తాజాగా అతను సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తోంది. చేగూరు రైల్వేట్రాక్ పై సూసైడ్ అటెంప్ట్ చేసి.. తృటిలో తప్పించుకున్న రాజ్ కుమార్.. ఇప్పటికీ పోలీసులకు కనిపించలేదు. హత్యలకు ముందు అతనివద్ద మూడు మొబైళ్లు, 12 సిమ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురి హత్యల అనంతరం వాటిని స్విచ్చాఫ్ చేశాడు. చేగూరు రైల్వే స్టేషన్ నుంచి అతను తప్పించుకునే వీలుందని అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ - బెంగళూరు హైవేల్లోని హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ లను విస్తృతంగా పరిశీలిస్తున్నారు. రాజ్ కుమార్ తో మాట్లాడిన ప్రతిఒక్కరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Next Story