- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పెండింగ్ స్టైపెండ్లు, మౌలిక వసతుల లేమిపై విద్యార్థుల ఆందోళనకు దిగారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన స్టైపెండ్ చెల్లించకపోవడంతో పాటు హాస్టల్‌లో కనీస మౌలిక వసతులు కల్పించడం లేదంటూ మెడికల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. గత పది రోజులుగా తమ సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. ప్రశ్నించిన తమకు నిర్లక్ష్యంగా సమాదానాలు ఇవ్వడంతో పాటు రూడ్‍గా వ్యవహరిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాటిని తేలికగా తీసుకుంటున్నారని, విద్యార్థుల సంక్షేమంపై యాజమాన్యానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
పొలిటికల్ అండదండతో గొంతునొక్కే ప్రయత్నం:
కాలేజీ యాజమాన్యానికి రాజకీయ అండదండలు ఉండటంతో తమ సమస్యలను బయటకు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ఫిర్యాదు చేసినా చర్యలు ఉండవనే భయంతో చాలామంది విద్యార్థులు మౌనంగా ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. స్టైపెండ్ ఆలస్యం కావడం వల్ల తమ రోజువారీ ఖర్చులు, విద్యకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు తెలిపారు. మరోవైపు తాగునీరు, పరిశుభ్రత, హాస్టల్ వంటి ప్రాథమిక సదుపాయాల లేమి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో చివరకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
సమస్యలు తీరే వరకు పోరాటం ఆపబోం!
సంబంధిత ఉన్నతాధికారులు, కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి తమ పెండింగ్ స్టైపెండ్లను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రి, హాస్టల్ ప్రాంగణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని మెడికోలు స్పష్టం చేశారు






