- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి: SFI
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి బలవంతంగా చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డితో పాటు పలువురిపై పోలీసులు పిడిగుద్దులు, లాఠీలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నాంపల్లితో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య హక్కులపై దాడేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా పేద విద్యార్థులకు దూరం చేసే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.






