- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SFI: ‘ఫీజు’ బకాయిల కోసం పోరుబాట.. ఎల్లుండి రాష్ట్రంలో కాలేజీలు బంద్ : ఎస్ఎఫ్ఐ పిలుపు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్శిటీల బంద్‌కు ఎస్ఎఫ్ఐ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్శిటీల బంద్‌కు ఎస్ఎఫ్ఐ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిద్రావస్థలో ఉందని, విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. గత ఆరేళ్లుగా సుమారు రూ. 8 వేల కోట్లు పైగా ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలు చేస్తామని, దశలవారీగా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా కనీసం ఇచ్చిన టోకెన్‌లకు కూడా నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు పోరాడితే రూ. 1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు.
విద్యార్థులపై ఫీజుల భారం..
విద్యార్థులపై ఒత్తిడి ఫీజులు రావడం లేదనే పేరుతో విద్యా సంస్థల యాజమాన్యాలు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల నుండి బలవంతంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపు కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి జీవో జారీ చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం వెంటనే స్పందించాలని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇన్ని ఏళ్లుగా పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రికి విద్యపై అవగాహన లేకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే విద్యారంగం అగమ్యగోచరంగా మారిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్, డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, ఫీజుల బకాయిలు వంటి సమస్యలపై సీఎం స్పందించడం లేదన్నారు. యూనివర్శిటీల్లో కూడా డైట్ చార్జీలు విడుదల చేయలేదని, అభివృద్ధి చేయలేదని తెలిపారు.
ఛలో హైదరాబాద్ హెచ్చరిక..
తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, నవంబర్ మొదటి వారంలోగా బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫీజులు విడుదల చేయకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని ప్రకటించారు. అక్టోబర్ 30న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసింది.






