ప్రేమ ముసుగులో ‘సెక్స్‌టార్షన్’ రక్కసి.. డిజిటల్ యుగంలో పెరిగిన వేధింపులు

by Kema Shiva Kumar |

డిజిటల్ ప్రేమ వాలెంటైన్ గిఫ్ట్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక, మానసిక మోసాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సెక్స్‌టార్షన్, మాట్రిమోనియల్ స్కామ్‌ల ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్న నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రేమ ముసుగులో ‘సెక్స్‌టార్షన్’ రక్కసి.. డిజిటల్ యుగంలో పెరిగిన వేధింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, మాట్రిమోనియల్ సైట్ల ద్వారా పరిచయాలు పెరిగే ఈ రోజుల్లో ‘డిజిటల్ రొమాన్స్’ సర్వసాధారణమైంది. అయితే, ఈ వర్చువల్ ప్రేమ వెనుక తీవ్రమైన ఆర్థిక, మానసిక ప్రమాదాలు దాగి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వాలెంటైన్ గిఫ్ట్ లింకులు, ఫ్లవర్ డెలివరీ మోసాలు, డిస్కౌంట్ కూపన్లు, ఫ్రీ గిఫ్ట్ వోచర్లు, ‘సర్‌ప్రైజ్ పార్సిల్’ సందేశాల రూపంలో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది.

ఆన్‌లైన్ సెక్స్‌టార్షన్

సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకుని, వీడియో కాల్స్‌తో ప్రలోభపెట్టి, వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి బెదిరించడాన్నే 'సెక్స్‌టార్షన్' అంటారు. హైదరాబాద్‌కు చెందిన ఓ 60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఒక మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆమె బలవంతంపై అనుచితంగా ప్రవర్తించిన ఆయన, ఆ వీడియో రికార్డింగ్‌తో బెదిరింపులకు గురై రూ. 1.60 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. 2025లో 1,231 కేసులు నమోదు కాగా.. బాధితులు రూ.3.20 కోట్ల మేర బాధితులు మోసపోయారు. 2026 జనవరిలోనే 88 కేసులు నమోదయ్యాయి.

సైబర్ స్టాకింగ్, ఆన్‌లైన్ వేధింపులు

పరిచయం పెంచుకున్నాక సోషల్ మీడియా ద్వారా వేధించడం, నకిలీ ఖాతాలు సృష్టించి బెదిరించడం, బాధితుల స్నేహితులకు అసభ్య సందేశాలు పంపడం వంటివి దీని కిందకు వస్తాయి. 2025లో 3,113 కేసులు నమోదు కాగా, 2026 జనవరిలోనే 359 కేసులు నమోదయ్యాయి.

మాట్రిమోనియల్ మోసాలు

ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ రంగ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు అని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ 29 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ మహిళ నమ్మించింది. విదేశాల్లో ఉంటున్నానని చెప్పి, నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించి రూ. 46 లక్షలు దోచుకుంది. 2025లో 384 కేసులు నమోదు కాగా. రూ.12.65 కోట్ల మేర బాధితులు మోసపోయారు. 2026 జనవరిలో 39 కేసులు నమోదయ్యాయి.

వాలెంటైన్ గిఫ్ట్ స్కామ్‌లు

వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ ఆఫర్ల పేరుతో వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్‌కు లింకులు పంపిస్తున్నారు. ఆ లింకులను క్లిక్ చేయగానే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలియని లింకులను క్లిక్ చేయవదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ పేర్కొన్నారు. ఎవరికీ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930‌కి కాల్ చేయాలని సూచించారు.

Next Story