TG: భూభారతి చట్టం అమలైతే ఏం వస్తుంది?.. కేసీఆర్, రేవంత్ తెచ్చిన చట్టాల మధ్య వ్యత్యాసం ఏంటి?

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆరేండ్లుగా సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం లభించడం లేదని 9 లక్షల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

TG: భూభారతి చట్టం అమలైతే ఏం వస్తుంది?.. కేసీఆర్, రేవంత్ తెచ్చిన చట్టాల మధ్య వ్యత్యాసం ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆరేండ్లుగా సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం లభించడం లేదని 9 లక్షల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తామంటూనే ఆర్వోఆర్ -2020లో ఆ సెక్షన్లను తొలగించడంతో తలెత్తిన ఈ వివాదానికి ముగింపు పలకడం లేదు. భూభారతి చట్టం ఆర్వోఆర్ -2025లో పెండింగ్ దరఖాస్తుల వరకు పరిశీలించి రెగ్యులరైజ్ చేయొచ్చని ఆఫీసర్లకు అధికారాలు కట్టబెట్టారు. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అమల్లోకి వచ్చేసింది. కానీ నేటికీ ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు కాలేదు. దీంతో రాష్ట్రంలో భూభారతి చట్టం అమలైతే ఏం వస్తుంది? కేసీఆర్ తెచ్చిన చట్టానికి, రేవంత్ తీసుకొచ్చే చట్టానికి మధ్య వ్యత్యాసం ఏంటి? అనే డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తావనే వద్దంటూ పేచీ

ఆరేండ్లుగా ఎదురుచూస్తోన్న వారందరికీ కొత్త ఆర్వోఆర్ చట్టం-2025 ఓ వరం కానున్నది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే చట్టంలోనూ పేర్కొన్నది. కానీ మొదటి నుంచి కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు ఈ సాదాబైనామాల పరిష్కారం ఇష్టం లేదు. చట్టంలో ఈ ప్రస్తావన వద్దంటూ పేచీ పెట్టారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సైతం దరఖాస్తుల పరిశీలనకు ససేమిరా అంటున్నారు. గత ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇస్తూ అప్లికేషన్లు స్వీకరించింది. కానీ చట్టబద్ధతను పరిశీలించకుండానే ఆర్వోఆర్ 2020ను అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ 5ఎ, 5 బిలను తొలగిస్తూ రూపొందించిన ధరణి చట్టం ద్వారా దాఖలైన దరఖాస్తులన్నీ ఆరేండ్ల నుంచి పెండింగ్‌లో పడ్డాయి.

అటకెక్కించిన దరఖాస్తులు

సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కాని 9 లక్షల కుటుంబాలకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అన్నింటినీ కోర్టు కేసు అంటూ అటకెక్కించారు. నిజానికి భూములు కొనుగోలు చేసిన రైతు, విక్రయించిన పట్టాదారుడో కోర్టుకు వెళ్లలేదు. ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేకుండానే అప్లికేషన్లు ఎలా స్వీకరించారని, వాటిని ఏ చట్టం ప్రకారం పరిష్కరిస్తారన్న అనుమానంతో కేసులు దాఖలయ్యాయి. దాంతో అప్లికేషన్లు పరిష్కరించకుండా స్టే విధించారు. అయితే, కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు ఆప్షన్ ఉంది. ఆ విషయాన్ని కోర్టుకు సమర్పించి స్టే వెకెట్ చేయించేందుకు ఏ ప్రయత్నమూ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. రెండు రోజుల క్రితం లీఫ్స్ సంస్థ సాగు న్యాయయాత్ర పేరిట యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నల్లగొండ జిల్లా మునుగోడు, చండూరు, నాంపల్లి, మల్లేపల్లి ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో వందలాది మంది రైతులు సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

అడ్డుకుంటున్న ఐఏఎస్‌లు

భూభారతి చట్టం రూపకల్పన సందర్భంలోనూ కొందరు ఐఏఎస్‌లు పెండింగ్ సాదాబైనామాల పరిష్కారంపై పేచీ పెట్టారు. అధికారంలోకి వస్తే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పట్టుబట్టారు. దీంతో ఆర్వోఆర్-2025లో అధికారాలను కట్టబెట్టారు. భూభారతి అమలైన తర్వాత కూడా కోర్టు స్టే వెకెట్ చేయించడంలో తాత్సారం వెనుక ఆ ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నది. రెవెన్యూ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వాటి కంటే అధికంగా సాదాబైనామా పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. వీటికి పరిష్కారం లభిస్తే 18 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుంది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ఆదరణ వస్తుంది. కానీ అధికారులు ఏ ఉద్దేశంతో భూభారతి చట్టంలో పేర్కొన్న సాదాబైనామాల అధికారాల సమాచారాన్ని కోర్టులకు సమర్పించడం లేదో అర్థం కాని విషయం.

5(ఎ), 5(బి) తొలగింపుతోనే సమస్య

ఆర్వోఆర్ 1971 యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదాబైనామాలకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించారు. కానీ కొంత కాలానికి భాగ పంపకాలు, నోటి మాట, తెల్ల కాగితాల ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. దాని ఫలితంగానే ఆర్వోఆర్ యాక్ట్ 1971లో 5ఎ, 5బి సెక్షన్లు తర్వాత అమెండ్‌మెంట్ చేశారు. 5ఎ ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్, వాటిపై 5బి కింద ఆర్డీవోకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నిర్దేశించారు. ఈ రెండు సెక్షన్లు 1989లో చేర్చడం గమనార్హం. దాంతో 1971–1989 మధ్య కాలంలో భూమి ఎలా సంక్రమించినా.. అది వాస్తవమైతే రికార్డులకు ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్వోఆర్ 1971 యాక్టులో రూల్ పొజిషన్‌లో తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే విచారించారు. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు. ఆ ఆర్డర్ కాపీ విలువైనదిగా మారింది. అయితే, ఆర్వోఆర్ 2020లో ఈ రెండు సెక్షన్లను తొలగించారు. కానీ అప్లికేషన్లు మాత్రం స్వీకరించారు. ఏ చట్టం ప్రకారం క్రమబద్ధీకరిస్తారన్న ఫిర్యాదుతోనే కోర్టు స్టే విధించింది.

ఆరేండ్లుగా ఎదురుచూపులు

బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో జీవో 112 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబర్ 10 నుంచి 29 తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్వోఆర్ 2020ని అమల్లోకి వచ్చింది. అందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. అయినా అది అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 వరకు 6,74,201 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 9 లక్షల వరకు వచ్చాయి. ఆర్వోఆర్ 2020లో వీటి పరిష్కార మార్గాలను క్లోజ్ చేశారు. దాంతోనే ఎలా చేస్తారని, ఏ చట్ట ప్రకారం క్రమబద్ధీకరిస్తారంటూ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడా సమస్య తలెత్తకుండా ఆర్వోఆర్ 2025లో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రొవిజన్ కల్పించారు. కొందరేమో సాదాబైనామాల దరఖాస్తులపై కోర్టులో కేసు ఉందని, స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా చేస్తారంటూ వాదిస్తున్నారు. ఆ కేసు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా చేస్తారన్న అంశంపైనే.. ఇప్పుడా అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అంటున్నారు. స్టే వెకెట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలన్న అవసరం సైతం లేదంటున్నారు. దానికి తోడు 2020 అక్టోబర్ 29 వరకు దాఖలైన 2.26 లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసే వీలున్నది. దానిపై ఎలాంటి పేచీ లేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం ద్వారా దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమేనంటున్నారు. ఇప్పటికే ఐదేండ్లుగా వారంతా భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్నారు. వారి అప్లికేషన్లకు ఏదో ఒక రిప్లై రాకపోతే ఇబ్బంది పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story