- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ సర్కారుకు చుక్కెదురు.. రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
రేవంత్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. రికార్డు ధరలు పలికిన రాయదుర్గం టీజీఐఐసీ (TGIIC) భూముల వేలంపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వేలం వేసిన భూమిలో కొంత భాగం తమదేనని పేర్కొంటూ ఎస్‌బీఐ యాజమాన్యం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల పాటు స్టే విధించింది. అదేవిధంగా ఆ మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనల ఉల్లంఘన వల్లే ఆ భూమి వేలానికి..
కాగా, విచారణ సందర్భంగా కోర్టు హాల్‌లో ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) ధర్మాసనం ఎదుట గట్టిగా వాదనలు వినిపించారు. ‘2010లోనే రాయదుర్గంలోని సదరు భూమికి సంబంధించి అప్పటి టీజీఐఐసీతో ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండేళ్ల కాలపరిమితిలోనే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఒప్పందం జరిగి దాదాపు 16 ఏళ్లు గడిచినా ఎస్బీఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదు’ అని ఏఏజీ కోర్టుకు విన్నవించారు. నిబంధనల ఉల్లంఘన వల్లే ఆ భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.
న్యాయమూర్తి తీవ్ర అసహనం..
ఏఏజీ వాదనలపై స్పందించిన గౌరవ న్యాయమూర్తి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ‘అసలు ఏ కారణంతో ఆ భూమిని వేలం వేశారు? అది ఎస్బీఐకి కేటాయించిన భూమి అని మీకు తెలీదా.. ఓ ప్రభుత్వ సంస్థ భూమిని ఇలా ఎలా వేలం వేస్తారు?" అని ఏఏజీని నిలదీశారు. అంతేకాకుండా, ‘ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో స్థిరాస్తి (Real Estate) వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా?’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలపై ఏఏజీ కలుగజేసుకుంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాయదుర్గం వేలంపై 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






