- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టులో రంగనాథ్‌కు ఎదురుదెబ్బ.. ‘హైడ్రా’ చీఫ్‌గా తొలగించాలని సీఎస్‌కు ఆదేశాలు
తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ (AV Ranganath)కు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయనను తక్షణమే హైడ్రా కమిషనర్‌గా తప్పించాలంటూ ధర్మాసనం సీఎస్ సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయన స్థానంలో ఓ ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు కట్టబెట్టాలని సూచించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు, దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయని అందులో పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధపు కథనాలు సృష్టించి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ, ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు గాను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లా..!
అయితే, విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై హాట్ కామెంట్స్ చేసింది వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తుచేసింది. అదేవిధంగా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లోనే ఉందని, అండర్ టేకింగ్ తర్వాత కూడా మళ్లీ అదే స్థలంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించింది. ‘ఒకే ఒక్క అధికారిపై, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కనబెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి?’ అని ధర్మాసనం రంగనాథ్‌ను, ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. ఒక వేళ రంగనాథ్ ఇలానే హైడ్రా కమిషనర్‌గా కొనసాగితే.. రూల్ ఆఫ్ లాకు అర్థం ఉండదని, పూర్తిగా తప్పుదోవ పట్టే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. ఇన్ని ఉల్లంఘటనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదేపోస్టులో కొనసాగించడం సరికాదని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను తక్షణమే ఆ పోస్ట్ నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.






