- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను వెంటాడుతున్న రెండు టెన్షన్స్.. ముంచుకొస్తున్న మరో రెండు.. గణపతి యాగం గట్టెక్కించేనా?
సమస్యల వలయంలో చిక్కుకున్న కేసీఆర్.. కష్టాల నుంచి బయటపడేందుకు గణపతి యాగం చేసినట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యల వలయంలో చిక్కుకున్న కేసీఆర్.. కష్టాల నుంచి బయటపడేందుకు గణపతి యాగం చేసినట్లు తెలిసింది. ఉద్యమం కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత తన కను సైగలతోనే అంతా నడిపించారు. ఉద్యమ పార్టీ నుంచి బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మార్పు చెందినప్పటికీ.. ఆయన ఒంటి చేత్తోనే పార్టీని నడిపించారు. ‘ఆయన చేసిందే శాసనం.. చెప్పిందే వేదం’ అన్నట్లుగా నడిచింది. రాష్ట్రంలో రెండు సార్లు పార్టీని ఆయన అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగానూ కేసీఆర్ కొనసాగారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లు వెనక్కి తిరిగిచూసుకోలేదు. కానీ, ప్రస్తుతం ఆయన్ను కొత్త తలనొప్పులు వెంటాడుతున్నాయి. ఒకవైపు.. తన సొంత కూతురు కల్వకుంట్ల కవిత రూపంలో మరొకటి కాళేశ్వరంతో పాటు ఇతర కేసుల విచారణలు ఇప్పుడు కొరకరాని కొయ్యలా తయారయ్యాయి. ఈ రెండు కారణాలు అటు రాష్ట్రవ్యాప్తంగానూ పార్టీలో గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. కార్యకర్తల్లోనూ రోజురోజుకూ ఆందోళనకర పరిస్థితులే కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న కేసులు.. విచారణలు
సుమారు పదేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో తీసుకొచ్చిన పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా.. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు పథకాల మీద విచారణ చేయిస్తున్నది. అందులో భాగంగానే కాళేశ్వరంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నది. దీనిపై వేసిన ఎంక్వయిరీ కమిషన్ సైతం అదే తేల్చింది. కావాలనే ప్రాజెక్టు లొకేషన్ మార్చారని పేర్కొంది. ఇందులో ముఖ్యంగా నాటి సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావును దోషులుగా తేల్చింది. వీరితో పాటు మరికొంత మందిని సైతం దోషులుగా పేర్కొంది. దాంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు.. విద్యుత్ కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం భావించింది. దీనిపై ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉన్నది. అటు.. గొర్రెల స్కాం మీద విచారణ నడుస్తున్నది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గతంలో ఈ ఫార్ములా కార్ రేస్ పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నది. దాంతో ఆ కేసు సైతం విచారణలో ఉన్నది. వీటితో పాటు ఇంకా చాలావరకు నాటి ప్రభుత్వంపై.. అందులో పనిచేసిన పెద్దలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో కేసీఆర్ సతమతం అవుతున్నారన్న టాక్ ఉంది.
కొరకరాని కొయ్యలా కవిత..
మరోవైపు.. సొంత కూతురే అయినప్పటికీ ఇటీవల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సస్పెండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఆ పార్టీకి నిద్రలేని రాత్రులను చేస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్‌ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఇప్పటికే హరీశ్‌రావు, సంతోష్‌రావులను టార్గెట్ చేసిన ఆమె వారి అవినీతిని బయటపెట్టింది. అంతటితో ఆగకుండా.. ‘కవితక్క అప్‌డేట్స్’ పేరుతో ఉన్న ‘ఎక్స్’ అకౌంట్‌లో ఒక్కొక్కరి చిట్టాను ఆమె మద్దతుదారులు విప్పుతున్నారు. గురువారం సంతోష్ రావుకు సంబంధించి ట్రాక్టర్ల కొను‘గోల్‌మాల్’పై బయటపెట్టారు. తాజాగా.. శుక్రవారం కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోకుండా పార్టీలోని కీలక నేతలు చేసిన కుట్రను వెలుగులోకి తెచ్చారు. హంపీకి వెళ్లి సీక్రెట్ మీటింగ్ పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా ముందుముందు ఇంకా లీకులు ఉన్నాయని ఇప్పటికే కవిత హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఈ ‘ఎక్స్’ ఖాతాలో రోజులకో సంచలన అంశం బయటపెడుతున్నారు. దాంతో ఈ పరిణామాలు సైతం కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ అంశాలన్నీ కేసీఆర్‌కు ఇప్పటికే తెలిసినా.. తెలియకపోయినా.. ఈ ట్వీట్లతో తన వెనుక ఇంత కుట్ర జరుగుతున్నదా? అనే కోణంలో ఆలోచిస్తున్నారన్న టాక్ లేకపోలేదు.
ఫాంహౌజ్‌లో గణపతి యాగం
పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో శుక్రవారం గణపతి యాగం నిర్వహించారు. ఇటు కేసులు.. అటు విచారణలు.. కవిత ఎపిసోడ్ తలనొప్పిగా మారడంతో కేసీఆర్ ఈ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కేసీఆర్‌కు ముందు నుంచి యాగాలు చేయడం అలవాటు. ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన యాగాలు చేస్తుంటారని టాక్. అందులో భాగంగానే తన కుటుంబసభ్యులతో కలిసి ఈ యాగం చేపట్టారని సమాచారం. అంతేకాకుండా గత ఐదారు రోజులుగా కేటీఆర్ ఫాంహౌజ్‌లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. చివరకు పార్టీలో చేరికలను సైతం అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. ఈ యాగంలో కేటీఆర్ సైతం పాల్గొన్నారని సమాచారం.
ముంచుకొస్తున్న ఎన్నికలు..
మరోవైపు.. రాష్ట్రంలో స్థానిక సంస్థలతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక సమయం దగ్గర పడుతున్నది. జూబ్లీహిల్స్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దాంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను వచ్చే నెలలో నిర్వహించేందుకు ఈసీ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే ఇక్కడ అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకోవడం బీఆర్ఎస్‌కు తప్పనిసరి. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేతలంతా ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. కనీసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు చూసే వారు కరువయ్యారు. దాంతో ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు మరికొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడొచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ వాటికి సైతం నోటిఫికేషన్ వస్తే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కీలక నేతలంతా ఫాంహౌజ్ చుట్టూరా తిరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్‌ను ఎప్పుడు సమాయత్తం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.






