వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు

by Muthe.Rajitha |   (  Updated:2025-11-20 13:51:28  IST  )

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ / వికారాబాద్ ప్రతినిధి : వికలాంగుడితో జీతం ఏం సుఖంగా ఉంటుంది, నీకు కావలసిన అందమైన జీవితాన్ని నేను ఇస్తాను అంటూ నమ్మించి మోసం చేసి ఒక పాప కూడా పుట్టిన తర్వాత ప్రియురాలిని ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరి శిక్ష పడింది. గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ఒక చారిత్రక తీర్పును వెలువరించింది. 2019 సంవత్సరంలో తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడైన గురు ప్రవీణ్ కుమార్‌కు మరణశిక్ష (ఉరిశిక్ష),10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది.

ఇట్టి వివరాలను జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి వెల్లడించారు. కేసు వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లికి చెందిన గురు ప్రవీణ్ కుమార్, చాందినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, చాందినికి అంతకుముందే వివాహం జరిగి ఆయాన్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ, తమ బిడ్డేనని అంగీకరించి ఈ దంపతులు వికారాబాద్‌కు మకాం మార్చారు. వారికి ఏంజెల్ అనే పాప కూడా జన్మించింది. కాగా భార్య చాందిని మొబైల్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందనే అనుమానం గురు ప్రవీణ్ కుమార్‌కు బలంగా ఉండేది.

ఇట్టి విషయంలో చాలా సార్లు గొడవలు జరిగినాయి. అయినను మారకపోవడంతో భార్య పైన అనుమానం పెంచుకొని ఈ అనుమానం ఎలాగైనా భార్యను చంపాలనే ఉద్దేశంతో 2019 ఆగస్టు 4వ తారీకు రోజు రాత్రి పిల్లలు నిద్రించిన తర్వాత కోపంతో తన భార్య చాందినిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం, ఆయనే ఇద్దరు పిల్లలైన ఆయాన్ (బాబు) ను రాడ్డు తో కొట్టి, ఏంజెల్‌(పాప)ను గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు. ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు గురు ప్రవీణ్ కుమార్ తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైలు పట్టాలవైపు వెళుతున్నాడు.

మార్గమధ్యలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కనిపించగా, తాను చేసిన నేరాన్ని చెప్పి వెళ్దామని స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని, నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన తర్వాత మొదటి ఐఓ అప్పటి టౌన్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ రావు తక్షణమే క్రైమ్ నెంబర్ 247/2019, సెక్షన్ 302 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం 2వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ పి. సీతారాం, 3వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ ఏ.సంజీవ రావు కేసును పటిష్టంగా, లోపాలు లేకుండా దర్యాప్తు పూర్తి చేశారు.

దర్యాప్తు పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించగా, వాదోపవాదాలు విన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు ఉరిశిక్ష తో పాటు 10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ చారిత్రక తీర్పును ప్రకటించారు.

ఈ కేసులో నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పి. సుధాకర్ రెడ్డిని, ఐఓలు: అప్పటి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్ రావు, అప్పటి డీఎస్పీలు పి.సీతారాం, ఏ. సంజీవ రావు, ప్రస్తుత అధికారులు అయిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్, బ్రీఫింగ్ ఆఫీసర్ గిరన్న, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్. నరేందర్, లైసానింగ్ ఆఫీసర్ యస్. శ్రీనివాస్ (ఎస్‌ఐ), ఇ.చంద్ర శేఖర్ (ఏఎస్ఐ) లను జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Next Story