CM Revanth Reddy: మోడీ అనుకుంటే కుదరదు.. జీఎస్టీ నష్టం కేంద్రమే భరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

జీఎస్టీ మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: మోడీ అనుకుంటే కుదరదు.. జీఎస్టీ నష్టం కేంద్రమే భరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలపై (GST Reforms) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని రాష్ట్రానికి జరిగే ఈ నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలన్నారు. ఇవాళ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వస్తున్న ఆదాయం ప్రకారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఇప్పుడు ఈ నిర్ణయంతో నష్టం జరుగుతోందని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి ఏర్పడే నష్టంపై నివేదిక కూడా ఇచ్చారని వెల్లడించారు. జీఎస్టీ చట్టం తెచ్చిన సమయంలో 14 శాతం ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వయబులిటీ గ్యాప్ ఫండ్ (viability gap fund) ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే వీజీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, అంతే తప్ప మేము నిర్ణయాలు తీసుకుంటాం మీ చావు మీరు చావండి అని మోడీ (Modi) అనుకుంటే అది మంచిది కాదన్నారు. రాష్ట్రానికి వస్తున్న నష్టంపై డిప్యూటీ సీఎం రాస్తారని దాన్ని కిషన్ రెడ్డి కేంద్రం వద్దకు తీసుకువెళ్లి నష్టాన్ని భర్తీ చేయించాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు కార్మికులకు బోనస్ పెంపు:

కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని, రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు.సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు అని ఇందులో రూ.4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని చెప్పారు. రూ. l2360 కోట్లు నికర లాభాలు వచ్చాయి. అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించినట్లు తెలిపారు. గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5000 బోనస్ ఇచ్చామని ఈసారి రూ. 500 పెంచి రూ. 5,500 అందిస్తున్నామన్నారు.

సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం:

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి 2 బ్లాక్ లు కోల్పోయిందని, 2 కోల్ బ్లాక్ లు ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకున్నారని చెప్పారు. కోల్ బ్లాక్ లను తిరిగి ప్రభుత్వం తిసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని సీఎం అన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటామని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామని వెల్లడించారు.

Next Story