- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sensational News: కేసీఆర్‌కు నోటీసులు? దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్.. ఎక్స్‌క్లూజివ్ వీడియో
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు తెలుస్తున్నది. ఆయనతోపాటు గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీశ్‌రావుకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులను విచారించిన చంద్రఘోష్.. నీటి పారుదల శాఖకు చెందిన మరో 52 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గురువారమే రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ చంద్రఘోష్.. శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఘోష్ డిసెంబర్ 5వరకు ఇక్కడే ఉండి విచారణ కొనసాగించనున్నారు. కాగా.. ఇటీవలే కాళేశ్వరంపై చంద్రఘోష్ విచారణ గడువును ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
మూడో విడత క్రాస్ ఎగ్జామినేషన్..
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ మూడో విడత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఇంజినీర్లను ప్రశ్నించారు. ఇక మూడో విడతలో భాగంగా ముందుగా ఐఏఎస్‌లు, ఆ తరువాత రిటైర్డ్ ఐఏఎస్‌లను విచారించనున్నారు. అనంతరం అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను సైతం విచారణ చేయనుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, డిజైన్ల ఖరారు, నిర్మాణ పనులు చేసిన సమయంలో ఉన్న నీటిపారుల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, రజత్ కుమార్, అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి, మరికొందరు ఐఏఎస్‌లను విచారించే అవకాశం ఉందని సమాచారం. వీరందరికి కూడా ఈనెలలోనే నోటిసులు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా.. ఇప్పటికే విజిలెన్స్, ఎన్టీఎస్ఏ ఫైనల్ రిపోర్టులు కమిషన్‌కు చేరాయి. దీంతో త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయనున్నట్లుగా సమాచారం.
కర్త, కర్మ, క్రియ మొత్తం కేసీఆరే..
మూడు బ్యారేజీ నిర్మాణ స్థలం, బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం, ప్రాజెక్టు డిజైన్లు, వ్యాప్కోస్ సంస్థకు నామినేషన్ పద్ధతిపై సర్వే పనులు ఇవ్వడం తదితర వాటికి అన్నింటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తాము ఫాలో అయ్యామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. తాము వాటి డిజైన్లను ఖరారు చేయలేదని, కేసీఆర్ సూచనలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాము ప్రశ్నించే స్థాయిలో లేకపోవడంతో వాటిని ఫాలో కావాల్సి వచ్చిందని వారందరూ కమిషన్‌కు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. వ్యాప్కోస్ తయారు చేసిన కాళేశ్వరం డీపీఆర్‌నే ప్రభుత్వం ఆమోదించిందని, ముఖ్యమంత్రి దానికే అనుమతి ఇస్తూ సంతకం చేశారని తెలిపారు. నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చారని వెల్లడించారు. తాము సూచించినట్లు కాకుండా స్లూయిస్ గేట్ల సైజు, బ్యారేజీల ప్రధాన గేట్ల సైజును తగ్గించారని కమిషన్ విచారణలో పేర్కొన్నారు.
కేసీఆర్, హరీశ్ ఎంక్వయిరీ తప్పనిసరి..!
కాళేశ్వరంపై నియమితులైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో నీటిపారుదల శాఖ కీలక అధికారులందరూ కేసీఆర్ పేరునే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే కర్త, కర్మ, క్రియ అని గతంలోనే కేసీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాటికి బలం చేకూరుస్తూ అధికారులు కూడా తాము అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే విన్నామని.. పనులు చేశామని.. ఆయనకు ఎదురు చెప్పలేక ఆయన నిర్ణయాలు ఫాలో అయ్యామని తెలిపారు. వాటన్నింటికీ సమాధానం రాబట్టాలంటే విచారణ కమిషన్‌కు కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారు ఏ ఆలోచన ప్రకారం ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని కాళేశ్వరంగా మార్చారు? కొత్త ఎంత ఆయకట్టును ప్రతిపాదించారు? బ్యారేజ్ సైట్‌లను అక్కడ ఎందుకు ఖరారు చేశారు? బ్యారేజ్‌లలో నీటిని ఎందుకు నిల్వ చేశారు? దేశంలో ఎక్కడా లేని విధంగా బ్యారేజీల నిర్మాణంలో సీకెంట్ విధానాన్ని ఇక్కడ ఎందుకు వాడారు? తదితర వాటిపై విచారణ కమిషన్ ప్రశ్నించనున్నట్లు సమాచారం.






